హైదరాబాద్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా లేని కొత్త సంప్రదాయాన్ని తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆదివారం ఇంటర్ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేకే రిలీజ్ చేయడం చర్చకు దారితీసింది. సాధారణంగా టెన్త్, ఇంటర్ ఫలితాలను ముఖ్యమంత్రి లేదా విద్యాశాఖ మంత్రి విడుదల చేయడం ఆనవాయితీ. సమైక్యరాష్ట్రం నుంచి ఇదే పద్ధతి కొనసాగుతూ వస్తున్నది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ సంబంధిత శాఖ మంత్రే విడుదల చేస్తుంటారు.
కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంప్రదాయానికి తిలోదకాలిచ్చింది. నిరుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. కానీ ఈ ఏడాది విద్యాశాఖ మంత్రి అయిన సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు సైతం ముఖం చాటేశారు. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఫలితాలు విడుదల చేయడమే గాక వేదికపై అన్నీ తానై వ్యవహరించారు. సర్కార్ తీరుపై విద్యారంగ నిపుణులు, మేధావులు అభ్యంతరం చెబుతున్నారు. ఈ వ్యవహారం విద్యారంగంపై చిన్నచూపు చూడటమేనని విమర్శలు గుప్పిస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్లలో ఏనాడూ పూర్తిస్థాయిలో విద్యాశాఖపై సమీక్షించలేదని పలువురు ఆగ్రహిస్తున్నారు. పాముకాట్లు, కలుషిత ఆహారంతో గురుకుల విద్యార్థులు మృత్యువాతపడుతున్నా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. తాజాగా ఇంటర్ ఫలితాల విడుదల కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి. ‘రేవంత్ సారూ.. ఫలితాల విడుదలకు తీరికలేదా? విద్యాశాఖ మంత్రికి ఇంత కంటే ముఖ్యమైన పనేం ఉన్నదో?’ అంటూ చురకలంటించారు. తీరికలేని సారు ఆ శాఖను అట్టిపెట్టుకోవడమెందుకని ప్రశ్నించారు. కార్పొరేట్ స్కూళ్లకు రిబ్బన్ కట్ చేసేందుకు సమయం దొరుకుతది గానీ.. ఫలితాల విడుదలకు వీలు కుదరలేదా?’ అంటూ ట్రోల్ చేశారు.