హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల ఎగ్జామినర్ విధులు కొందరు లెక్చరర్లకే కేటాయించడం రగడకు దారితీసింది. ఇంటర్‌బోర్డు పక్షపాత వైఖరిపై పలు సంఘాల నేతలు తీవ్రంగా మం డిపడుతున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కాగా, కేవలం సర్కారు కాలేజీల లెక్చరర్లకు ఎగ్జామినర్ డ్యూటీలు వేసింది. మాడల్ స్కూళ్లల్లో ఇంటర్ పాఠాలు బోధిస్తున్న రెగ్యులర్ అధ్యాపకులకు, సర్కారు కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లకు డ్యూటీలు వేయలేదు. కేజీబీవీ టీచర్లకు మాత్రం అవకాశం కల్పించారు. మొత్తం మూడు విడతల్లో ప్రాక్టికల్స్ పరీక్షలు జరగనుండగా, ఒక్కో లెక్చరర్‌కు 12 నుంచి 14 రోజులు విధులు కేటాయించారు. ఈ సారి కేవలం ప్రభుత్వ జేఎల్స్‌కు మాత్రమే స్కాడ్, ఫ్లైయింగ్ స్వాడ్ డ్యూటీలు కేటాయించారు. ఇలా ఇష్టారీతిన డ్యూటీలు వేయడంతో కొందరు మాడల్, ప్రైవేట్ కాలేజీల్లోని లెక్చరర్లు కినుక వహించారు. వీరు జవాబు పత్రాల మూల్యాంకనాన్ని బహిష్కరించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. అయితే సీసీ కెమెరాల ఏర్పాటు నిబంధన అన్ని చోట్ల అమలుకాలేదని తెలిసింది. మొత్తంగా గందరగోళంగా ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు కూడా తలెత్తాయని కాలేజీల యాజమాన్యాలు తెలిపాయి.
మాడల్ స్కూల్, జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకులే 12 ఏండ్లుగా సేవలందిస్తున్నారు. కానీ వీరికి ప్రాక్టికల్స్ విధులు కేటాయించకపోవడం గర్హనీయం. కేవలం సర్కారు కాలేజీల రెగ్యులర్ అధ్యాపకులకే విధులు కేటాయించారు. ఇలా చేయడం మమ్మల్ని కించపరచడమే. ఇంటర్‌బోర్డు చర్యలతో మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. వార్షిక పరీక్షల్లో సీఎస్‌డీవో, కస్టోడియన్ వంటి విధులను కేటాయించాలి. లేదంటే స్పాట్ క్యాంప్‌ను బహిష్కరిస్తాం. ఇతర విధులకు దూరంగా ఉంటాం. మూల్యాంకనాన్ని బహిష్కరిస్తాం.