గద్వాల అర్బన్, సెప్టెంబర్ 10 : బీసీ సామాజిక వర్గానికి చెందిన యువతిని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ప్రేమించి పెండ్లి చేసుకోవడంతో అమ్మాయి బంధువులు యువకుడి ఇంటిని కూల్చివేసిన ఘటన సీఎం సొంత జిల్లా జోగుళాంబ గద్వాలలో చోటు చేసుకున్నది. గద్వాల మండలం రేపల్లెకు చెందిన యువతి హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నది. యువతి ఇంటి సమీపం లో ఉండే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు నగరంలోనే ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరు బుధవారం హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. హైదరాబాద్ పోలీసులు.. అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడగా వారి వెంట అమ్మాయి వెళ్లడానికి ఇష్టపడనట్టు తెలిసింది. ఇది జీర్ణించుకోలేని అమ్మా యి బంధువులు కోపంతో రేపల్లెలో అబ్బాయి ఇంటిని జేసీబీ సాయంతో కూల్చివేశారు. గద్వాల సీఐ శ్రీనివాసులు, రూరల్, పట్టణ ఎస్సైలు శ్రీకాంత్, కల్యాణ్‌కుమార్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకోగా ఈ ఘటనకు పాల్పడినవారు, యువకుడి తల్లిదండ్రులు ఊరు విడిచి వెళ్లినట్టు తెలిసింది.