హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు అందించే మెమోలను పటిష్టంగా ముద్రించాలని ఇంటర్‌బోర్డు అధికారులు నిర్ణయించారు. నీళ్లల్లో నానబెట్టినా పాడవనంత.. చింపినా చిరిగిపోనంత పటిష్టంగా మెమోలను ముద్రించనున్నారు. అయితే ఇవి వచ్చే విద్యాసంవత్సరమే అందజేస్తారు. నాన్ టేరబుల్ పేపర్‌ను వినియోగిస్తారు. ఇది వాటర్ రిసిస్టెన్స్, వాటర్ ఫ్రూఫ్ పేపర్. పైగా ట్యాంపరింగ్ చేయడానికి వీలుండదు. చింపినా కూడా చిరగదు. ప్రస్తుతం 120 గ్రామ్స్ ఫర్ స్క్వేర్ మీటర్(జీఎస్ఎం) పేపర్‌ను వాడుతుండగా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి 180 జీఎస్ఎం పేపర్‌ను వాడుతారు.
ఇంటర్ మెమోలు అసలువో.. నకిలీవో తేల్చేందుకు ఇంటర్‌బోర్డు చర్యలు చేపట్టనున్నది. మెమోలపై క్యూఆర్‌కోడ్ ముద్రించనున్నది. ఈ కోడ్‌ను స్కాన్ చేయగానే ఇంటర్‌బోర్డు డాటా బేస్‌తో అనుసంధానమవుతుంది. వెంటనే అసలుదో.. నకిలీదో తేలిపోతుంది. సీజీజీ వద్ద నుంచి ఆరేండ్ల డాటాను బ్లాక్‌చైన్ టెక్నాలజీ సహకారంతో అనుసంధానం చేస్తారు. మెమోలపై విద్యార్థి కలర్ ఫొటోను ముద్రించనున్నారు. ఎస్సెస్సీబోర్డు నుంచి పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్(పెన్), ఆపార్, ఆదార్ నంబర్లతో అనుసంధానిస్తారు. దీని ద్వారా డ్రాపౌట్లను అరికట్టవచ్చని బోర్డు అధికారులు భావిస్తున్నారు.