Inter Exams | హైదరాబాద్: ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్. వార్షిక పరీక్షలకు హాజరయ్యే వారికి ఉన్న నిమిషం నిబంధనను ఇంటర్ బోర్డు సడలించింది. ఆలస్యంగా వచ్చే వారిని కూడా పరీక్షకు అనుమతించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే నిర్దిష్ట కారణాలతో పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకునే వారిని 5 నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో అనుమతించాలని పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు ఇంటర్ బోర్డు సూచించింది.
తాజా నిర్ణయంతో ఉదయం 9 గంటలు అంటే.. 9 : 05 గంటల వరకు విద్యార్థులను పరీక్షకు అనుమతిస్తారు. అయితే, ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8 : 45 గంటల లోపే పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. నిమిషం నిబంధన కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పరీక్షాకేంద్రానికి సమయానికి చేరుకోలేకపోవడంతో విద్యార్థి శివకుమార్‌ను పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంచలనంగా మారడంతో తాజాగా ఐదు నిమిషాల వెసులుబాటు కల్పిస్తూ ఇంటర్‌బోర్డు శుక్రవారం అధికారిక ప్రకటనను విడుదల చేసింది.