
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మే నెలలో నిర్వహించాలని ఇంటర్‌బోర్డు భావిస్తున్నది. ఇప్పటికే షెడ్యూల్‌ను సైతం ఖరారుచేసినా అధికారికంగా ప్రకటించలేదు. ప్రాథమిక సమాచారం మేరకు మే 2వ తేదీ నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించాలని ఇంటర్‌బోర్డు అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహిస్తామని ఇప్పటికే ఇంటర్‌బోర్డు అధికారులు ప్రకటించారు. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో మే మొదటి వారం నుంచి పరీక్షలు ప్రారంభించాలని భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత, ఫిబ్రవరి వరకు కొవిడ్ తీవ్రత అధికంగా ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. డాక్టర్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిలబస్ పూర్తిచేయడం, పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమం లో మేలోనే పరీక్షలు నిర్వహించడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు. త్వరలోనే పూర్తి షెడ్యూల్ విడుదలకానున్నది. ఇప్పటికే పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల కాగా, విద్యార్థులు చెల్లిస్తున్నారు.