హైదరాబాద్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. రాత్రి, ఉదయం వేళల్లో బయటకు రావాలంటే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. వచ్చే మూడు రోజులు చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4 నుంచి 6 డిగ్రీల వరకు తగ్గాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6 నుంచి 12 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని, 19 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు.
ఈ క్రమంలో ఉదయం, రాత్రివేళ వృద్ధులు, చిన్నారులు బయటకు రావొద్దని, ఒకవేళ వచ్చినా చలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.1 డిగ్రీలు నమోదైంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో సాధారణం కన్నా 5.7 డిగ్రీలు తగ్గి 6.3 నమోదైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఐదు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. తీవ్రమైన చలి దృష్ట్యా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ పాఠశాలల పనివేళల్లో మార్పులు చేశారు.