Devadala Project | వరంగల్, మార్చి 24(నమస్తేతెలంగాణ ప్రతినిధి): దేవాదుల ఎత్తిపోతల మూడో దశలోని దేవన్నపేట పంప్‌హౌస్‌లోని మోటర్లను ఆన్ చేసే ప్రక్రియ ఎంతకీ కొలిక్కి రావడంలేదు. ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, సాగునీటి సరఫరా తీరులోని వైఫల్యాలకు ఎక్కడా పొంతన కుదరడంలేదు. ఎండల తీవ్రతతో యాసంగి పంటలకు ఇబ్బందికరంగా ఉంటున్నది. ఈ తరుణంలో దేవాదుల ప్రాజెక్టు నుంచి సరిపడా సాగునీటిని సరఫరా చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం దేవనన్నపేటలోని మోటర్లను ఆన్ చేస్తామని సాగునీటి శాఖ ఉన్నతాధికారులు మూడు రోజుల క్రితం ప్రకటించారు. ఇప్పటికీ మోటర్లు ఆన్ కాలేదు. ప్రయోగాత్మకంగా నీరు లేకుండా(డ్రై రన్) మోటర్లను ఆన్ చేశామని, నీటిని పంపింగ్ చేసే విషయంలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఆస్ట్రియా కంపెనీ ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నార ని, మంగళవారం ఆన్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. పంపుహౌస్‌లోని మోటర్లతో పంపింగ్ విషయంలో సాగునీటి శాఖ అధికారుల ప్రకటనలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
24గంటల్లో పంపులు ఆన్ చేయాలి: ఎర్రబెల్లి
దేవరుప్పుల: 24గంటల్లో దేవన్నపేట పంప్‌హౌస్ మోటర్లు ఆన్ చేసి దేవాదుల నీటిని వదలకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. సోమవారం ఆయన హనుమకొండలోని తన నివాసంలో మాట్లాడుతూ.. సోమవారంలోగా నీళ్లిస్తామని అధికారులు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మంత్రులు వచ్చి ఆన్ చేస్తారంటూ జాప్యం చేయడమేంటని మండిపడ్డారు. ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు.