హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): వేములవాడ రాజన్న ఆలయంలో ధర్మగుండం ఉంటుందా? ఉండదా? ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టిన ప్రభుత్వం దానిని ఏం చేయబోతున్నది? ఇవీ ఇప్పుడు రాజన్న భక్తులను తొలచివేస్తున్న ప్రశ్నలు. వేములవాడ రాజన్న ఆలయంలోని ధర్మగుండానికి చాలా ప్రాధాన్యమున్నది. స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా ధర్మగుండంలో విధిగా స్నానాలు ఆచరిస్తారు. మొక్కులు తీర్చుకోవడానికి వచ్చే భక్తులు ముందు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకొంటారు. ఆ తరువాత గుడిని ఆనుకొని ఉన్న ధర్మగుండంలో స్నానాలు ఆచరిస్తారు. అనంతరం కోడెలు కట్టి మొక్కులు తీర్చుకొంటారు. ఆ తరువాత రాజన్నను దర్శించుకొంటారు. ఇది రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు విధిగా ఆచరించే సంప్రదాయం. ఒకవేళ ధర్మగుండంలో స్నానమాచరించలేని పరిస్థితి ఏర్పడితే, దాన్నొక వెలితిగా భావిస్తుంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆలయ పునరుద్ధరణ పనుల్లో భాగంగా మోక్ష ప్రదాయినిగా భక్తులు విశ్వసించే ధర్మగుండాన్ని పూర్తిగా కూలగొట్టారు.
అయితే, దీనిని భక్తుల అభీష్టాల మేరకు పునరుద్ధరిస్తారా? లేదా? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ధర్మగుండాన్ని రెండు భాగాలుగా అంటే దేవ ధర్మగుండం, భక్త ధర్మగుండం నిర్మించనున్నట్టు పునరుద్ధరణ ప్రణాళికల్లో పొందుపరిచారు. తొలి విడత పునరుద్ధరణ పనుల్లో దేవ ధర్మగుండం నిర్మిస్తామని, దేవాలయం లోపల ఉండేలా చూస్తున్నామని నిర్మాణాలు పర్యవేక్షిస్తున్న అధికారులు చెప్పారు. రెండో విడత పనులు మొదలయ్యేదాకా భక్త ధర్మగుండం నిర్మించే అవకాశం లేదని తెలిపారు. తొలి విడత పనుల్లో ధర్మగుండం లేదని తెలియడంతో భక్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. భక్త ధర్మగుండాన్ని నిర్మించాల్సిందేనని భక్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల దేవాదాయ శాఖ వేములవాడ పునరుద్ధరణ పనులపై నిర్వహించిన అంతర్గత సమావేశంలో స్వామివారి కోనేరు భక్త ధర్మగుండం, కల్యాణకట్ట, క్యూకాంప్లెక్స్‌ల నిర్మాణాలపై చర్చించారు. మొదటి విడతలో ఈ నిర్మాణాలు లేకపోవడం ద్వారా భక్తులకు అసౌకర్యం కలుగుతుందన్న విషయం కూడా చర్చకు వచ్చింది.
మొదటి విడతలో నిర్మిస్తారా?
మొదటి విడతలో మహాప్రాకారం గోడ తూర్పు వైపు అంతర్గత మండపం, నాగిరెడ్డి మండపం తదితర నిర్మాణాలతోపాటు సీసీటీవీ, ఎలక్ట్రికల్ సర్వీసెస్, హెడ్‌కౌంట్ కంట్రోల్ రూమ్స్ నిర్మాణాలు చేపట్టనున్నారు. అయితే, కోనేరు నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. దీంతో ధర్మగుండం, కల్యాణకట్టల నిర్మాణంపై దేవాదాయ శాఖలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నది. మొదటి విడత పనులను కేవలం రూ.100 కోట్లతోనే పూర్తి చేయాల్సి ఉన్నందున భక్తులు కోరుతున్న ధర్మగుండం నిర్మాణం ఎలా చేపట్టాలనే అంశంపై దేవాదాయ శాఖ అధికారులు, ఆర్కిటెక్ట్, ఇతర విభాగాల ముఖ్య అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.