హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ‘అన్నతో ఇప్పుడే మాట్లాడిన. వాళ్లకు వీళ్లకు భయపడను. నేను చెప్పిందే ఇక్కడ వేదం. నా వెనుక అన్న, వదిన ఉన్నరు’ ఇవీ రాష్ట్ర రాజధానిలోని ట్రై కమిషనరేట్ల పరిధిలో ఓ డీసీపీ తరచుగా చెప్పుకుంటున్న మాటలు. తన వద్దకు ఎవరైనా పనిమీద వెళ్లినప్పుడు.. ఇలాగే మాట్లాడుతూ అందరినీ అశ్చర్యానికి గురిచేస్తున్నారని పోలీసు వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ‘అన్న అంటే చోటా మోటా లీడర్ కాదు. అన్ననే నాకు బాస్’ అంటూ చెప్పుకుంటారని వినికిడి. ఇప్పుడు వాళ్ల పార్టీ నాయకులు ఎవరైనా ఆయన పేరు పక్కన అన్న అని సంబోధిస్తూ పిలుచుకోవడంలో పెద్ద విశేషమేంటి అని అనుకుంటారు. కానీ అలా ఎవరైనా అంటే ఆమెకు చాలా కోపం వస్తుందట. ‘నన్ను సీదాసాదా అనుకుంటున్నవా.. నాకు అన్న కుటుంబం ఎంత దగ్గరో తెలుసా.. నాపై ఎవరెవరో ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు.. ఎందో ఎంక్వయిరీలు అని అంటున్నరు. అదంతా ట్రాష్. అంతా అన్న చూసుకుంటడు. రేపోమాపో నాకు వచ్చే పోస్టింగ్ కూడా అప్పుడే కన్ఫర్మ్ అయింది. కీలకమైన జోన్‌కు వెళ్తున్నాను’ అని చెప్పుకుంటారని తెలిసింది.
‘అన్న’ ఆశీస్సులతో చెల్లె సెటిల్మెంట్లు!
కీలకమైన కమిషనరేట్‌లో డీసీపీగా పని చేస్తున్న ఐపీఎస్ అధికారిపై చాలా ఆరోపణలు ఉన్నాయి. మరో ఇద్దరు డీసీపీలతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది. శివారు ప్రాంతాల్లో భూవివాదాలను పరిష్కరించడమే పనిగా పెట్టుకున్నట్టు సమాచారం. కొందరు సీఐలు, అధికార పార్టీ స్థానికనేతలతో కలిసి ల్యాండ్ సెటిల్మెంట్ దందా చేస్తున్నట్టు తెలుస్తున్నది. మేడమ్ గారి సామాజిక వర్గానికి చెందిన వారికి సెటిల్మెంట్లలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం. ‘ఏ ల్యాండ్ అయినా తీసుకొని రా.. ఎక్కడైనా సరే సెటిల్ చేద్దాం’ అంటూ తన సామాజిక వర్గానికి చెందిన రియల్టర్ల వద్ద చెప్పుకోవడం, పెద్ద ఇష్యూ అయితే నేనే స్వయంగా వెళ్లి అన్నను కలుస్తా’ అంటూ హామీ ఇస్తున్నట్టు పోలీసు అధికారులు కొందరు అంటున్నారు. సదరు జోన్లో ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన కీలక వ్యక్తులు భారీగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారని ప్రజలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి అధికారులు, పెద్ద తలకాయలు కలిసి సెటిల్మెంట్లు చేస్తుంటే సామాన్యులు పోలీసుల వద్దకు వెళ్లి, సమస్యలను ఎలా చెప్పుకుంటారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎన్ని అరోపణలు వచ్చినా.. ఉన్నతాధికారులు కూడా ఆమె విషయంలో నోరు మెదపడం లేదని పోలీస్ సిబ్బంది చెప్తున్నారు.
ఆ డీసీపీ పోస్టు వస్తుందా..!
ఈ నెలఖరులో డీజీపీ రిటైర్మెంట్ ఉండడంతో పోలీస్‌శాఖలో ఐపీఎస్‌ల బదిలీలు ఉండొచ్చనే చర్చ పోలీస్‌శాఖలో జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఎవరికి వారే మంచి పోస్టింగ్‌ల కోసం తమ బాస్‌ల వద్దకు వెళ్లి పైరవీలు మొదలు పెట్టినట్టు తెలుస్తున్నది. ఈ అధికారి చెప్పుకుంటున్నట్టు కీలక పోస్టులోకి వెళ్తారా లేదా అనేది స్పష్టతలేదు. అయితే ప్రస్తుతం ఆమె కోరుకుంటున్న పోస్టులో జాతీయ స్థాయి నాయకుడి అండదండలున్న అధికారే కావడం గమనార్హం. అ అధికారిపై కూడా పలు సెటిల్మెంట్ల ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే బదిలీలలో డీసీపీ మేడమ్.. ‘అన్న ఆశీస్సులతో’ కోరుకున్న చోటకు వెళ్తారా? లేదా? ఇంకెన్ని అరాచకాలు చూడాలో అని పోలీస్ శాఖలోని పలువురు అధికారులు వ్యక్తిగత సంభాషణలలో మాట్లాడుకుంటున్నారు.