హైదరాబాద్/నీలగిరి, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ఇంటెలిజెన్స్ వర్గాలు ఉమ్మడి నల్లగొండకు చెందిన ఓ అడిషనల్ ఎస్పీ అవినీతి బాగోతాన్ని రెడ్‌హ్యాండెడ్‌గా బయటపెట్టగా.. విషయం బయటికి పొక్కకుండా సదరు ఏఎస్పీని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పీడీఎస్ బియ్యం సరఫరా , ఆవులు తరలింపుపై పోలీస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. డబ్బులు ఇస్తే సరిహద్దులు దాటిస్తున్న వైనాన్ని చూసి ఇంటెలిజెన్స్ సిబ్బందే అవాక్కైనట్టు తెలిసింది.
రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టగా.. ఆరోపణలు నిజమేనని తేలడంతో డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. సదరు అధికారిపై వచ్చిన ఇతర ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నట్టు తెలిసింది. నివేదిక అనంతరం ఆయనపై చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. ఇటీవల ‘క్రైమ్ మిర్రర్’ పేరుతో కొందరు నకిలీ జర్నలిస్టులు ఏకంగా ఓ సీఐ నుంచి రూ.1.10 లక్షలు వసూలు చేశారు. ఇవ్వకపోతే అవినీతి బండారం బయటపెడతామని బెదిరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పోలీసుల తీరు వివాదాస్పదంగా మారుతున్నదని ఉన్నతాధికారులే చెప్తున్నారు.