హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): బిగ్ బ్రదర్ అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆ ‘పోలీసు కమిషనర్’పై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో శనివారం ‘ఒక్కో బదిలీకి రూ.20 లక్షలు!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. అందులో నెలల వ్యవధిలోనే బదిలీలు చేపట్టి.. భారీగా డబ్బులు వసూలు చేసిన ఆ సీపీ, అతను చేస్తున్న రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు, బిగ్ బ్రదర్స్ అండతో రెచ్చిపోతున్న వైనాన్ని క్షుణ్ణంగా వివరించింది.
ఈ క్రమంలో ‘ఆ సీపీ ఎవరు?’ అంటూ ఇంటెలిజెన్స్ అధికారులు, డీజీపీ కార్యాలయ సిబ్బంది వివరాలు సేకరించారు. ఆ కథనంలో ఉన్న అంశాల ఆధారంగా బాధితుల వివరాలు సేకరించి.. వారి నుంచి పూర్తి సమాచారం తెలుసుకునే పనిలో పడ్డారు. స్వయంగా సీపీ ఇట్లాంటి అక్రమ వ్యవహరాల్లో తలదూర్చడంపై ఇటు డీజీపీ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.