ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 11: ప్రతిభ కంటే న్యాయం ముఖ్యమైనదని, అందరికీ సమన్యాయం దక్కాల్సిన అవసరం ఉన్నదని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. అన్యాయానికి గురైన వాళ్లు ప్రశ్నిస్తేనే సమాజం చైతన్యవంతమవుతుందని అభిప్రాయపడ్డారు. ‘ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు మేధావుల సంఘీభావ సభ’ను శనివారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ హరగోపాల్ హాజరై మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పీడితకులాల తరఫున ఈ సభలో మాట్లాడడం తనకు దొరికిన గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ఒక న్యాయమూర్తిగా అన్నికోణాల నుంచి శాస్త్రీయంగా పరిశీలించి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధమైనదిగా చెబుతున్నట్టు తెలిపారు.
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. సమాన అవకాశాలు కల్పించేందుకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఒక సాధనంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. చట్టపరంగా, రాజకీయపరంగా ఆటంకాలను తొలగించి వర్గీకరణ అమలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలోని ఐక్య ఉద్యమాలకు పునాదిగా వర్గీకరణ ఉద్యమం పనిచేసిందని చెప్పారు. వీలైనంత త్వరగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ మాట్లాడుతూ.. ఈసారి వర్గీకరణ జరిగి రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, జయప్రకాశ్ నారాయణ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కే శ్రీనివాస్, డాక్టర్ నందిని సిధారెడ్డి, విమలక్క, ప్రొఫెసర్లు సూరేపల్లి సుజాత, భాంగ్యా, ఈసం నారాయణ, ఆరెపల్లి రాజేందర్, వివిధ సంఘాల నాయకులు బూరం అభినవ్, గజవెల్లి ఈశ్వర్, పృథ్వీరాజ్యాదవ్, తెలంగాణ విఠల్, వెంకట్ మారోజు పాల్గొన్నారు.