వర్గల్, అక్టోబర్ 24 : ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని వ్యవసాయరంగ అభివృద్ధికి కృషిచేయాలని, ఆధునిక వంగడాలు రూపొందించి సాగులో నూతన ఒరవడులు సృష్టించాలని కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా మర్కూక్-వర్గల్ మండలాల పరిధిలోని కావేరి యూనివర్సిటీ, సీడ్స్ కంపెనీని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు కలెక్టర్ హైమావతి, సీపీ విజయ్‌కుమార్, కావేరి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ జీవీ భాస్కర్‌రావు స్వాగతం పలికారు. యూనివర్సిటీ లో విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి డ్రోన్, రోబో టెక్నాలజీ, 3డీ ప్రింటింగ్, ఎంటమాలజీ, పాథాలజీ, సాయిల్ సైన్స్, బ్రీడింగ్ ఫిజియాలజీ ల్యాబ్‌లను గవర్నర్ పరిశీలించారు.
అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నట్టు తెలిపారు. కావేరి వర్సిటీ విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకొని నూతన ఒరవడిని సృష్టించాలని అన్నారు. విద్యార్థులు చదువు పట్ల జిజ్ఞాస, పట్టుదల, కార్యదీక్ష, ప్రగతిశీల భావాలను అలవర్చుకొని మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం కావేరి సీడ్స్ కంపెనీలో వర్మీ కంపోస్ట్‌ను పరిశీలించి, ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ సెంటర్‌ను గవర్నర్ ప్రారంభించారు. రీసెర్చ్ సెంటర్లో టిష్యూ కల్చర్, జీనోమిక్స్, జీన్ బ్యాంక్, స్పీడ్ బ్రీడింగ్, ప్లాంట్హెల్త్ బ్యాంక్ ఏర్పాట్లను పరిశీలించి ప్రశంసించారు. కార్యక్రమంలో కావేరి యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, యూనివర్సిటీ అధ్యాపక బృందం, సిబ్బంది, ఆర్డీవో చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.