హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తున్న ‘సమీకృత నీటిపారుదల చట్టం’ తుది దశలో ఉన్నదని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. గతంలో ఉన్న 18 రకాల చట్టాలను క్రోడీకరించి నూతన ముసాయిదాను తయారు చేశామని చెప్పారు. జలసౌధలో మంగళవారం ఉన్నతాధికారులతో నూతన చట్టం ముసాయిదాపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 1935లోనే నీటిపారుదల చట్టం ఉన్నదని గుర్తుచేశారు. ఆ తర్వాత నీటిపారుదల శాఖలో వచ్చిన దాదాపు 18 రకాల చట్టాలను క్రోడీకరించి, తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ‘సమీకృత నీటిపారుదల చట్టం’ ముసాయిదాను సిద్ధం చేశామని, త్వరలో సీఎం కేసీఆర్‌కు నివేదిస్తామని చెప్పారు. కృష్ణా జలాల్లో 575 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని కోరి నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఈఎన్సీలు మురళీధర్(జనరల్), అనిల్‌కుమార్ (అడ్మి న్), నాగేంద్రరావు (ఓఅండ్ఎం), సీఈలు మో హన్ కుమా ర్, శ్రీదేవి, ధర్మ, శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు.
ఆక్రమణ, ఆస్తుల ధ్వంసంపై చర్యలు
నూతన చట్టం ప్రకారం శాఖ ఆస్తులను ఎవరైనా ధ్వంసం చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకొనేలా నిబంధనలు రూపొందించారు. కాలువలు, ప్రాజెక్టులు, చెరువుల పరిధిలోని భూముల ఆక్రమణలను అడ్డుకోవడంపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. వరదల నియంత్రణ, ప్రాజెక్టుల విధుల్లో ఉత్తమ సేవలందిస్తున్న 17 మంది అధికారులకు మంగళవారం హైదరాబాద్ జలసౌధలో ప్రశంసాపత్రాలను అందజేశారు. వారిలో అడిషనల్ సెక్రటరీ శంకర్, జాయింట్ సెక్రటరీ భీమ్ ప్రసా ద్, కొత్తగూడెం సీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఈలు సాజిద్, శ్రీనివాస్, సుశీల్‌కుమార్, కే వెంకటేశ్వర్‌రెడ్డి, ఈఈలు రాజశేఖర్, రాంప్రసాద్, డీఈఈలు బోజదాస్, రామకిశోర్, పల్లె భాస్కర్, ఏఈఈలు మహేశ్ చండిక, రవికుమార్, జకీర్ హుస్సేన్, వెంకటేశ్, వంశీ ఉన్నారు.