
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 12 భవనాలు పూర్తయ్యాయి. నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, జిల్లాల సమీకృత కలెక్టరేట్ భవనాలు నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. డిసెంబర్ 31 నాటికి మరో 5 కలెక్టర్ కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయి. ఇందులో శంషాబాద్‌కు అతి సమీపంలో నిర్మిస్తున్న రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్, మేడ్చల్-మల్కాజిగిరి భవనాలు అక్టోబర్ 31 నాటికి.. మెదక్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లు డిసెంబర్ 31 నాటికి అందుబాటులోకి రానున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల భవనాలు 2022 మార్చి 31 నాటికి, నాగర్‌కర్నూల్, నిర్మల్, ఖమ్మం, సూర్యాపేట, మంచిర్యాల, జయశంకర్‌భూపాల్‌పల్లి జిల్లాల కలెక్టరేట్ భవనాలు 2022 జూన్ 30 నాటికి అందుబాటులోకి రానున్నాయి. కరీంనగర్ సమీకృత కలెక్టరేట్ నిర్మాణం పనులు టెండర్ల దశలో ఉండగా.. ములుగు, నారాయణపేట, అదిలాబాద్ నిర్మాణ పనులకు అంచనాలు రూపొందిస్తున్నారు. వరంగల్ కలెక్టర్ కార్యాలయానికి భూమిని పరిశీలిస్తున్నారు.