హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నదని హెచ్చరించింది. ఎల్నినో వల్ల నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైనప్పటికీ, గ్లోబల్ వార్మింగ్ కారణంగా వర్షాల స్వభావం పూర్తిగా మారిపోయిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పుడు వర్షాలు చాలా రోజుల పాటు కురవకుండా, తకువ సమయంలోనే అత్యంత తీవ్రతతో కురుస్తున్నాయని వివరించారు. ముంబై, ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు ఇలాంటివేనని వెల్లడించారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా రుతుపవనాల స్వభావం పూర్తిగా మారిపోయిందని భారత వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజే రమేశ్ చెప్పారు.