సుబేదారి, ఆగస్టు 23: నకిలీ పత్రాలతో ఇన్సూరెన్స్ పాలసీలు చేయించి బీమా కంపెనీలకు టోకరా వేస్తున్న ముఠాను వరంగల్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం హనుమకొండలో టాస్క్‌ఫోర్స్ ఇంచార్జి, అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. నల్లబెల్లి మండలం నందిగామకు చెందిన పుప్పాల రాము, చిట్యాల శ్రీకాంత్, వైనాల పవన్, అడ్డా రాజు, మడిపల్లి వెంకట్రాజం, ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన గన్నారపు మహేందర్, హైదరాబాద్‌కు చెందిన జీ మల్ల్లేశ్, వెంకటరావుతోపాటు మరో 11 మంది కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో పుప్పాల రాము, చిట్యాల శ్రీకాంత్ బీమా కంపెనీలో ఏజెంట్లుగా పనిచేస్తున్నారు.
వీరు వ్యక్తిగతంగా ఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులను గుర్తించేవారు. వారి కుటుంబీకులతో మాట్లాడి నకిలీ ఆధార్, పాన్‌కార్డులు సృష్టించేవారు. వ్యాధిగ్రస్థుల పేరుతో బీమా పాలసీలు తీసుకొనేవారు. వ్యాధిగ్రస్థులు చనిపోయిన తర్వాత నామినీతో బీమా డబ్బుల కోసం దరఖాస్తు చేసేవారు. ముందుగా చేసుకొన్న ఒప్పందంలో భాగంగా.. బీమా డబ్బులో 20 శాతానికిపైగా కాజేసేవారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి 8 మందిని పట్టుకొని, వారి నుంచి కారు, ట్రాక్టర్, రూ.లక్ష, ల్యాప్‌టాప్, నకిలీ పత్రాలు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు.