హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రెగ్యులర్‌గా ప్రీమియం చెల్లించినా బీమా చెల్లింపును నిరాకరిస్తారా? అని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ప్రశ్నించింది. బాధిత సంస్థకు 9 శాతం వడ్డీతో బీమా మొత్తం చెల్లించాలని దేశించడంతోపాటు ఇన్సూరెన్స్ సంస్థకు రూ.50 వేల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బేగంబజార్‌కు చెందిన నవభారత్ రోడ్ లైన్స్ వస్తు రవాణా సేవలందిస్తున్నది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఈ సంస్థ ప్రమాద బీమా పాలసీ (స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్స్)ని తీసుకున్నది. గోదాంలో పలు రకాల గూడ్స్‌ను నిల్వచేయగా, 2020 నవంబర్ 14న దీపావళి రోజు గోదాం ప్రాంగణంలో పటాకులు పేల్చడంతో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో గోదాంలోని వస్తుసామగ్రి దగ్ధమైంది.
ఈ నేపథ్యంలో నవభారత్ సంస్థ బీమా చెల్లించాలని కోరగా ఇన్సూరెన్స్ కంపెనీ నిరాకరించింది. దీంతో బాధిత సంస్థ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. సంస్థకు రావాల్సిన బీమా మొత్తం చెల్లించాలని కమిషన్ అధ్యక్షురాలు బీ ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సీ లక్ష్మీప్రసన్న, ఆర్ నారాయణరెడ్డితో కూడిన బెంచ్ పేర్కొన్నది. తొమ్మిది శాతం వడ్డీతో బీమా రూ.19.33 లక్షలు చెల్లించాల్సిందేనని ఆదేశించింది. బీమాచెల్లింపులో నిర్లక్ష్యం వహించినందుకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.50 వేల జరిమానా విధించింది. అంతేగాకుండా రూ.20 వేలు కోర్టు ఖర్చుల కింద అందజేయాలని సూచించింది.