Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : మంత్రి పొంగులేటి ఆదివారం అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారు. అసెంబ్లీలో ఓవైపు తన అక్రమాలపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంటే సభలో ఉండి సమాధానం చెప్పాల్సింది పోయి అసెంబ్లీలో ఆయన అడుగు కూడా పెట్టలేదు. అసెంబ్లీకి రాకుండా కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం కోసం ఆయన కేరళ వెళ్లారు. ఆయన అక్రమాలపై అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో పోరాడుతున్నది. మంత్రి పొంగులేటి క్రషర్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని, ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నది. ఇదే అంశంపై రెండు రోజులుగా బీఆర్ఎస్ సభను స్తంభింపజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సభలో జరిగే అంశాలతో సంబంధమే లేనట్టుగా మంత్రి ఎంచక్కా కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం గమనార్హం.
అక్కడ పతనంతిట్ట జిల్లా ఆడూర్ అసెంబ్లీ నియోజకవర్గ యూడీఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి శాంతకుమార్ (కాంగ్రెస్ పార్టీ)కు మద్దతుగా వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. దీంతో మంత్రి పొంగులేటి తీరుపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆయనపై జరుగుతున్న చర్చను వదిలి.. కేరళకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఆయనకు సంబంధించిన అంశంపై ప్రభుత్వం ఇరకాటంలో పడితే.. ఆయన మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఉంటే.. ఆయనకు అంటిన అవినీతి బురదను తామంతా అంటించుకోవాలా? తామే కడిగేయాలా? అంటూ ప్రశ్నిస్తుండటం గమనార్హం.
ఇక్కడ అక్రమాలు.. కేరళలో ప్రచారమా?
కేరళ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ నుంచి రూ.1,000 కోట్లు సర్దుబాటు చేస్తున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పలువురు మంత్రుల తీరు ఇందుకు బలం చేకూర్చుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో అక్రమాలు చేస్తూ, అడ్డంగా దోచుకుంటూ కేరళకు మూటలు మోస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అసెంబ్లీలో మైనింగ్ అక్రమాలపై రచ్చ జరుగుతుంటే మంత్రి పొంగులేటి కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ అక్రమాలు చేస్తూ.. కేరళలో ప్రచారాలు చేస్తారా? అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నది. తెలంగాణ ప్రజల సొమ్ము కేరళలో పంచుతున్నారంటూ ఘాటుగా విమర్శిస్తున్నది.
అందుకే సభకు రాలేదా?
ఓవైపు సభలో ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతుంటే మంత్రి పొంగులేటి సభకు ఎందుకు రాలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో పలురకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చ సమయంలోనే పొంగులేటి సభకొస్తే వివాదం మరింత ముదిరే అవకాశం ఉంటుందని అధికార పార్టీ ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ సభలో పొంగులేటి ఉంటే ఆయన ఆవేశంలో మరేదైనా మాట్లాడితే మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నట్టు సమచారం. అందుకే ఆయనను సభకు రావొద్దంటూ ముఖ్యనేతలే సూచించినట్టుగా తెలిసింది. శనివారం సైతం సీఎం వచ్చేంత వరకు సభలో ఉన్న సదరు మంత్రి పొంగులేటి సీఎం సభకు రాగానే ఆయన బయటకు వెళ్లిపోయారు. అప్పటికే ఈ మేరకు పొంగులేటికి ఆదేశాలు వెళ్లినట్టుగా తెలిసింది. ఇలా బీఆర్ఎస్ ఈ వివాదాన్ని సీరియస్గా తీసుకొని హౌస్ కమిటీ విచారణకు, ఆయన బర్తరఫ్నకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన సభలో ఉండకపోవడమే అన్ని విధాలుగా మంచిదనే ఆలోచనలో అధికార పార్టీ పెద్దలు ఉన్నట్టుగా తెలిసింది. అందుకే ఆయన సభను వదిలేసి ఎన్నికల ప్రచారానికి వెళ్లారనే చర్చ జరుగుతున్నది.