హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): మంత్రి బాంబులేటి బెట్టువీడక మరింత బరితెగిస్తున్నారు. కొడుకుతో పాటు రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులపై ఆగ్రహంతో ఊగిపోతూ వారి అంతుచూడనిదే వదిలేదు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ మండల పరిధి వట్టినాగులపల్లి వ్యవహారంలో గచ్చిబౌలి సీఐ సహా పోలీసు ఉన్నతాధికారిపై వెనక్కి తగ్గకుండా తానేంటో డైరెక్ట్‌గానే ప్రకటిస్తునానడు. అమాత్యుడి ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే సీఐపై బదిలీ వేటు వేసినా, ఉన్నతాధికారిని సైతం సాగనంపాలని ఆయన చేస్తున్న శపథం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టినాగులపల్లి సర్వే నంబరు 245లో ‘బాంబుల మంత్రి కొడుకు దౌర్జన్యకాండ’ ఎపిసోడ్ ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యాపారంలో భాగంగా వట్టినాగులపల్లిలో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదిరింది. పక్కన ఉన్న సర్వేనంబరు 245లోని భూమిని సైతం డెవలప్మెంట్కు ఇవ్వాలని భూయజమానులపై మంత్రితోపాటు ఆయన కుమారుడు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఎన్ని విధాలుగా ఒత్తిడి చేసినా వారు వినకపోవడంతో ఏకంగా రెవెన్యూ యంత్రాంగాన్ని వినియోగించి దశాబ్దాల తరబడి ఉన్న హద్దుల్ని మార్చి బాధితుల భూమిలో పక్క భూయజమానికి సంబంధించిన హద్దులు నిర్ధారించారు. నిస్సహాయులైన బాధితులు చేసేదేమీ లేక చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టేటస్ కో తెచ్చుకున్నారు.
స్టేటస్ కో తెచ్చుకున్న విషయం తెలిసిన మంత్రి కుమారుడు తీవ్ర కోపంతో ఊగిపోయి ఓ రాత్రి బౌన్సర్లతో అక్కడ వీరంగం సృష్టించారు. బాధితుల భూమి వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డును తీవ్రంగా కొట్టడంతో పాటు గోశాల, ప్రహరీగోడను జేసీబీలతో ధ్వంసం చేశారు. భయానక వాతావరణంలో సమాచారాన్ని అందుకున్న బాధితుడు ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్లో గోడు వెల్లబోసుకోవడం, నిబంధనల ప్రకారం గచ్చిబౌలి స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి చేరిన పోలీసులు బౌన్సర్ల వీరంగాన్ని నిలువరించడంతో పాటు కేసులు నమోదు చేశారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ పెద్దలు పోలీసు ఉన్నతాధికారిపై కన్నెర్ర చేసి, చర్యలకు ఉపక్రమించే క్రమంలో ‘నమస్తే తెలంగాణ’ దౌర్జన్యకాండ ఎపిసోడ్‌ను వెలుగులోకి తెచ్చింది.
‘నమస్తే తెలంగాణ’లో కథనాలు వెలుగుచూడటంతోనే అన్నదమ్ముల మధ్య వివాదాన్ని రాఘవ కన్స్ట్రక్షన్స్కు పులుముతున్నారని తప్పించుకునే యత్నం చేశారు. అప్పటికీ మరిన్ని వివరాలు వెలుగులోకి రావడంతో ఇక తప్పదన్నట్టుగా తన కుమారుడిపై కేసు నమోదైనట్టు మంత్రి అంగీకరించాల్సి వచ్చింది. ఈ ఎపిసోడ్‌తో తన ప్రతిష్ఠ దెబ్బతిన్నదంటూ సదరు పోలీసు ఉన్నతాధికారిపై వేటుకు పట్టుబడుతున్నట్టు సమాచారం. పచ్చినిజాలన్నీ వెలుగులోకి వచ్చిన వెంటనే చర్యలకు ఉపక్రమిస్తే ప్రజల్లో వ్యతిరేకతతోపాటు ప్రభుత్వంపై చులకనభావం కలుగుతుందని సర్కార్‌లోని ‘ముఖ్య’నేతలు బాంబులేటికి సర్దిచెప్పినట్టు తెలిసింది.
అయినా మంత్రి వినిపించుకోకపోవడం, విషయం కాస్త హస్తినదాకా వెళ్లగా పెద్దలు మంత్రితో మాట్లాడినట్టు పొలిటికల్ సర్కిల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివాదం రచ్చ అయిందని, బాధితులు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి రక్షణ తెచ్చుకున్నారని, అసలే గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న సమయంలో కీలకమైన పోలీసు ఉన్నతాధికారిపై వేటు వేస్తే ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని సదరు పెద్దలు సైతం వారించినట్టు తెలిసింది. మధ్యేమార్గంగా మంత్రిని సంతృప్తిపరిచేందుకు చట్టప్రకారం తన విధులు తాను నిర్వర్తించిన గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ను బదిలీ చేయించారు.
ఇన్స్పెక్టర్పై వేటుకు పోలీసు ఉన్నతాధికారులు అంగీకరించకపోయినా, మంత్రిని సంతృప్తిపరిచేందుకు పొలిటికల్ బాసులు పట్టుబట్టి ఉత్తర్వులు జారీ చేయించినట్టు చెబుతున్నారు. సీఐని బదిలీ చేయించింది బాంబులేటి ఒత్తిడితోనే కాగా పైకి మాత్రం, బాధితుల ఫిర్యాదుపై సకాలంలో స్పందించనందుకే బదిలీ చేసినట్టు పోలీసు వర్గాలు సర్ది చెప్పుకుంటున్నాయి. బాధితుడి ఫిర్యాదుపై సీఐ నిజంగానే సరిగా స్పందించకపోతే అసలు ఈ వ్యవహారమే వెలుగులోకి వచ్చేది కాదని, కేవలం బాంబులేటి కక్ష సాధింపు వల్లే సీఐ బదిలీ జరిగిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఈ పరిణామంతోనూ అమాత్యుడు సంతృప్తి చెందకపోగా పంతం వీడటం లేదనే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో తదుపరి అడుగులు ఎలా ఉంటాయనేది ఇప్పుడు రాజకీయ, అధికారవర్గాల్లో ఉత్కంఠను రేపుతున్నది.