ఎదులాపురం/జైనథ్(బేల), మే 31: పత్తి విత్తనాల అక్రమ నిల్వలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఫర్టిలైజర్ డీలర్లకు చెందిన 36 గోదాములను శుక్రవారం కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం సంబంధిత శాఖల అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. విత్తనాల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విత్తనాలు, ఎరువుల గోదాముల వద్ద రెవెన్యూ, పోలీసు సిబ్బందిని నియమించి విత్తనాలు అక్రమ రవాణా కాకుండా నిఘా పెట్టినట్టు తెలిపారు. 55 కంపెనీలకు చెందిన 128 రకాల 14.40 లక్షల పత్తి ప్యాకెట్లు అందుబాటులో ఉండగా 4 లక్షల ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఆర్సీహెచ్ విత్తనాలకు డిమాండ్ ఉన్నదని, నిరుడు 1.20 లక్షల ప్యాకెట్లు విక్రయించగా ఈ ఏడాది 1.50 లక్షల ప్యాకెట్లు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాల అక్రమ రవాణా జరగకుండా శంకర్ గూడా, ఆనంద్‌పూర్, పిప్పర్వాడ, లక్ష్మీపూర్, ఘన్పూర్ వద్ద చెక్‌పోస్టుల ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తున్నట్టు ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు.
18 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్న ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన డ్రైవర్ కోటేశ్వరావు బొలెరో వాహనం నంద్యాల జిల్లాలో 18 క్వింటాళ్ల పత్తి (లూజ్) విత్తనాల లోడ్‌తో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు బయలుదేరింది. ముందస్తు సమాచారంతో వ్యవసాయ అధికారులు, పోలీసులు గురువారం రాత్రి 11 గంటలకు పుల్లూరు టోల్గేట్ వద్ద పట్టుకున్నారు. వీటి విలువ రూ.9 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో గడువు తీరిన 10 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకొన్నట్టు వ్యవసాయ శాఖ ఏడీఏ శంకర్‌రాథోడ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, లూజు విత్తనాలు, గడువు తీరిన విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదిలాబాద్‌లో ఓ డీలర్ రాశి 659 పత్తి విత్తనాలను రైతులకు విక్రయించకుండా, వ్యవసాయ అధికారులకు స్టాక్ వివరాలను చూపించకుండా మోసం చేసినందుకు కేసు నమోదు చేసినట్టు వన్ టౌన్ సీఐ కే సత్యనారాయణ తెలిపారు.