హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సర్కారు తనిఖీలు చేయించనున్నదా? ఇందుకోసం సబ్‌కమిటీని నియమించనున్నదా? అంటే.. ప్రభుత్వవర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రభుత్వం ప్రొఫెషనల్ కాలేజీలకు దాదాపు రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పడిం ది. బకాయిలు చెల్లించేలా ఆదేశించాలంటూ ఐదు కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. మరో వంద కాలేజీలు న్యాయపోరాటానికి సిద్ధమైనట్టు తెలుస్తున్నది. కాలేజీల యజమానులు ఫెడరేషన్‌గా ఏర్పడి, 4 డిమాండ్లను సర్కారు ముందుంచారు. బకాయిలను విడుదల చేయకపోతే పోరాబాట తప్పదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తమ నోరు మూయించేందుకేనని తనిఖీల పేరుతో ప్రభుత్వం బెదిరిస్తున్నదని కాలేజీల యజమానులు మండిపడుతున్నారు.
2025-28 బ్లాక్ పీరియడ్‌లో ఫీజుల సవరణకు సర్కారు ఇటీవలే బ్రేకులు వేసింది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటర్ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ప్రతిపాదనలను పక్కనపెట్టింది. ఈ తరుణంలోనే తనిఖీలు చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. తనిఖీల్లో భాగంగా కాలేజీల డాక్యుమెంట్లు, ఆడిట్ రిపోరులు పరిశీలిస్తారని సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు ఫీజు బకాయిలు అడిగితే టాస్క్‌ఫోర్స్ దాడులు చేయించింది. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారే బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని యజమానులు మండిపడుతున్నారు.
కాలేజీలు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌ను ప్రారంభించుకోవాలని సర్కారు ఆదేశించింది. వెబ్‌కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేయాలని సూచించింది. టీఏఎఫ్ఆర్సీ సమావేశంలో ఈ ఏడాది ఫీజులను పెంచొద్దని సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే. దీంతో 2025- 26 విద్యాసంవత్సరంలో పాత ఫీజులేనని తేలింది. ఈ నేపథ్యంలోనే కౌన్సెలింగ్‌పై ఉన్నత విద్యామండలి వర్గాలు సర్కారు నుంచి స్పష్టత కోరాయి. పాత ఫీజుల ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రెండు, మూడు రోజుల్లో ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
ప్రభుత్వం ఇంజినీరింగ్ ఫీజులను సవరించకపోవడంపై న్యాయపోరాటం చేస్తాం. మూడేండ్లకోసారి ఫీజులు పెంచాలని ఉత్తర్వులు చెప్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవోను ప్రభుత్వమే అమలు చేయకపోతే ఎలా? ఫీజులు పెంచే ఆలోచన లేనప్పుడు టీఏఎఫ్ఆర్సీ ద్వారా నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు? మా నుంచి ప్రతిపాదనలు ఎలా స్వీకరించారు? మా నుంచి ఫీజులు ఎందుకు కట్టించుకున్నారు? అసాధారణంగా ఫీజులు పెంచిన కాలేజీలను పక్కనపెట్టి, మిగతా కాలేజీల ఫీజులు ఖరారు చేయవచ్చు కదా! కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.