నర్సింహులపేట, సెప్టెంబర్ 15: పంట నష్టపరిహారం విషయంలో కొందరు నాయకులు చెప్పిన బాధితులకే న్యాయం జరుగుతున్నదని, పంటలు నష్టపోయిన మిగతా వారిని అధికారులు పట్టించుకోవడం లేదని వదిలి మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల రైతులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే కో సం వచ్చిన అధికారులను తమకు నచ్చిన వారి పొలాల వద్దకే తీసుకెళ్తున్నారని, అధికారులు కూడా వారు చూపించిన పొలాల్లోనే నష్టపోయిన పంటలను పరిశీలిస్తున్నారని వాపోతున్నారు. దీనికి తోడు ‘మే ము చెప్తేనే పరిహారం వస్తుంది.. మాకు లంచాలు ఇవ్వాలి? లేకపోతే అంతేసంగతి. ఈ విషయం బయటకు చెప్పొ ద్దు.. ఒకవేళ చెప్తే పరిహారం రాదు’ అని భయపెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నష్టపరిహారాన్ని అంచనా వేయాలని జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఏవో, ఏఈవోలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. కానీ.. క్షేత్రస్థాయిలో పంటల పరిశీలనకు వచ్చిన అధికారులను కొంతమంది నాయకులు తమకు నచ్చిన పొలాలకు తీసుకువెళ్లి పంటల నష్టాన్ని చూపిస్తున్నారు. అసలు రైతులకు అన్యాయం చేస్తున్నారు. నష్టపరిహారం ఎకువగా ఇప్పించేందుకు డబ్బు సైతం వసూలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలైన బాధిత రైతులకు అన్యాయం జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు. పంటలను ఏవో, ఏఈవోలకు క్షేత్రస్థాయిలో చూపించాలని, ఇందులో ఎలాంటి పైరవీలకు తావులేదని ఏడీఏ విజయచందర్ స్పష్టంచేశారు.