కరీంనగర్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి ): రైతులకు పంపిణీ చేరాజన్న కోడెలసిన స్థితిగతులను తెలుసుకునేందుకు అధికార యంత్రాగం చర్యలు చేపట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశాల మేరకు దేవాలయ ఈవో రంగంలోకి దిగారు. పది ఉమ్మడి జిల్లాలకు ఇద్దరు అధికారుల చొప్పున నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు నేటి నుంచి కోడెల స్థితిగతులను తెలుసుకోనున్నారు. పూర్తి నివేదికను వారంలో సమర్పించాలని ఈవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాజన్న కోడెల పంపిణీలో అక్రమాలు, కబేళాకు తరలింపు విషయాలపై కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తాజాగా నిర్వహించిన సమావేశంలో అధికారులపై సీరియస్ అయినట్టు తెలుస్తున్నది. కోడెల పంపిణీ కమిటీకి అధ్యక్షుడైన తనకే తెలియకుండా మూడోవిడుత ఎలా పంపిణీ చేశారని ప్రశ్నించినట్టు సమాచారం. ఈనెల 7న ‘రాజన్న కోడెలు కోతకు?!’ శీర్షికన మొదలుపెట్టి.. ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. మంత్రి సురేఖ సైతం స్పందించారు. ఈ నేపథ్యంలో 17న కలెక్టర్ సందీప్‌కుమార్ తన చాంబర్లో వేములవాడ ఆలయ, గోశాల అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకు 1975 పశువులను గోశాల నుంచి పంపిణీ చేశామని, మొదటిదశలో 1278 కోడెలు, 75 ఆవులు, రెండోదశలో 389 కోడెలు, 45 ఆవులు, మూడోదశలో 188 కోడెలు పంపిణీ చేశామని అధికారులు వెల్లడించారు. మూడో దశ పంపిణీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించినట్టు తెలిసింది. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు గత జూలై 3 నుంచి ఇప్పటి వరకు పంపిణీ చేసిన కోడెలు, ఆవుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అధికారుల టీఏ, డీఏలను బిల్లుల చెల్లింపు తర్వాత చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొనగా.. వాహనాల్లేకుండా ఎలా వెళ్తామని పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నట్టు తెలుస్తున్నది.