హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): కొంతమంది తెలంగాణ పోలీసు అధికారులు రాజకీయ నేతలతోపాటు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారంటూ కొన్ని ఇంగ్లిష్, తెలుగు దినపత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ వ్యవహారంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరుపనుంది.
ఎస్ఐబీ చీఫ్ టీ ప్రభాకర్‌రావు పర్యవేక్షణలో మేకల తిరుపతన్న, డీ ప్రణీత్‌రావు, టాస్‌ఫోర్స్ మాజీ డీసీపీ జీ రాధాకిషన్‌రావు ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడినట్టుగా కేసులు నమోదయ్యాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే శరత్ ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేసినట్టు ఎస్ఐబీలో ఏఎస్పీగా పనిచేసిన భుజంగరావు పోలీసుల దర్యాప్తులో అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను హైకోర్టు పరిశీలించిన తర్వాత పిటిషన్‌గా స్వీకరించి విచారణకు నిర్ణయించింది.