(నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి) ; చెప్పేదొకటి చేసేది మరొకటి అంటే ఏమిటి? మోకాలికీ బోడిగుండుకూ ముడిపెట్టడం అంటే అర్థమేమిటి? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడమంటే అంతరార్థమేమిటి? ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలంటే రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి గురించి చెప్పుకోవాలి. దాడులు, దర్యాప్తులు, కేసులు, విచారణలు అంటూ ప్రతిపక్షాన్ని వేధించడమే పనిగా పెట్టకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, చివరికి తన మంత్రులపై వచ్చిన ఆరోపణల వ్యవహారాన్నీ ప్రతిపక్ష నాయకులకు ఎలా చుడుతున్నదో తెలుసుకోవాలి. కక్షసాధింపు రాజకీయాలే కార్యక్రమంగా ఎలా వ్యవహరిస్తున్నదో చూడాలి.
సభాముఖంగా అంగీకరించి..
‘రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అక్రమంగా మైనింగ్ చేస్తున్నది. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ మండలం మానస హిల్స్ వద్ద క్రషర్ మిషన్ పెట్టింది’ అని బీఆర్ఎస్ ఇటీవల శాసనసభలో ప్రస్తావించింది. ‘రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ అవుతున్నది. ఈ అక్రమాలపై హౌస్ కమిటీ వేయండి’ అని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు పట్టుబట్టారు. ఆరోపణలకు తగిన ప్రాథమిక ఆధారాలను సమర్పించారు. దీంతో ప్రభుత్వం తప్పు జరిగిందని సభాముఖంగా అంగీకరించింది. ప్రభుత్వం ఆ కంపెనీకి నోటీసులు ఇచ్చిందని, రాఘవ కన్స్ట్రక్షన్స్తో మైనింగ్‌శాఖ ఫైన్ కూడా కట్టించుకున్నదని సీఎం చెప్పారు. సీబీసీఐడీ దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. ఈ దర్యాప్తు ద్వారా అందరి సంగతీ తేలుస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడంతో, రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాల నిగ్గు తేల్చే ఉద్దేశంతోనే ఆయన ఉన్నట్టు అందరూ భావించారు. కానీ జరిగిందేమిటి?
రేవంత్ సూచనలకు అనుగుణంగా ఫైల్
రేవంత్‌రెడ్డి సూచనలకు అనుగుణంగా విధివిధానాలతో రూపుదిద్దుకున్న సీబీసీఐడీ విచారణ ఫైల్ ఆయన టేబుల్ మీదికి వచ్చింది. కానీ ఈ విచారణ ఎవరి మీద? తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మైనింగ్ విభాగంలో అమలు చేసిన పాలసీ మీద! ప్రతిపక్షం డిమాండ్ చేసినట్టుగా.. ప్రభుత్వం ప్రకటించినట్టుగా రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాల మీద కాదు. అసలా ప్రస్తావనే లేదు. ప్రతిపక్షం ప్రశ్నించింది రాఘవ కన్స్ట్రక్షన్స్ కుంభకోణం గురించి. ప్రభుత్వం సభలో చెప్పిందీ రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాల గురించే. కానీ చివరికి దర్యాప్తు మాత్రం బీఆర్ఎస్ సర్కార్ మైనింగ్ పాలసీ మీద? ఎందుకిలా? ఎందుకంటే రాఘవ కన్స్ట్రక్షన్స్ గురించి ప్రశ్నించిన హరీశ్‌రావు, గతంలో కొంతకాలం పాటు మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు. హరీశ్‌తో పాటు బీఆర్ఎస్ పదేండ్ల హయాంలో మైనింగ్ శాఖను నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌నూ టార్గెట్ చేయడం సర్కార్ లక్ష్యం. అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కాకుండా ప్రశ్నించిన వ్యక్తులు, పార్టీపైనే దర్యాప్తు అన్నమాట! తప్పు చేసినోడిమీద కాకుండా, తప్పును పట్టిచ్చిన వారిపైనే విచారణ.. ఇదీ ముఖ్యమంత్రి సభ సాక్షిగా ప్రకటించిన సీబీసీఐడీ దర్యాప్తులోని అంతరార్థం. కాంగ్రెస్ ప్రభుత్వ న్యాయం.
ఇంతకీ మైనింగ్‌లో ఏం జరిగింది?
మైనింగ్ ఆదాయం విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగింది? తెలంగాణ వచ్చాక ఏం జరిగింది? ఆదాయం పెరిగిందా? తగ్గిందా? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 వరకు అసలు మైనింగ్ శాఖలో ఎంత ఆదాయం వచ్చిందన్న లెక్కలే ప్రభుత్వం వద్ద లేవు. 2004-14 నడుమ ఎంత ఇసుక అమ్మారు? ఎంత డబ్బు వచ్చిందనేదానిపై సమగ్ర వివరాలేవీ తమ వద్ద లేవని స్వయంగా మైనింగ్ అండ్ జియాలజీ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం… 2008-09, 2011-12, 2012-13 సంవత్సరాల్లో మాత్రం కేవలం పదికోట్లకు లోబడి ఆదాయం వచ్చిందట. అదే తెలంగాణ ఏర్పడి, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొత్త ఇసుక పాలసీ తీసుకవచ్చింది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసింది. దీంతో ఇసుక అమ్మకం ద్వారా టీజీఎండీసీకి ఏటా ఏకంగా రూ.800 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. మారెట్లో ఎప్పుడూ ఇసుక కొరత ఏర్పడలేదు. ఇసుక సరఫరాదారుల మధ్య పోటీ ఉండటంతో ధర టన్నుకు రూ.1,400 దాటలేదు. పదేండ్లలో ఇసుక అమ్మకాల వల్ల ప్రభుత్వానికి సుమారు రూ. 5,966 కోట్ల ఆదాయం వచ్చింది. 2015-16లో 374 కోట్లు వస్తే, అది 2022-23 నాటికి 716 కోట్లకు పెరిగింది. ఆదాయం పెరిగితే కుంభకోణాలు జరిగినట్టా? ఆదాయం తగ్గితేనా? కానీ రేవంత్ ప్రభుత్వానికి ఇందులో అక్రమాలు కనిపిస్తున్నాయి.
మరి ఇప్పుడేం జరుగుతున్నది?
2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటికీ 4 నెలల ఆర్థిక సంవత్సరం మిగిలి ఉన్నది. ఈ నాలుగు నెలల్లోనే పరిస్థితి తారుమారైంది. ఆ ఏడాది మైనింగ్ రాబడి అనూహ్యంగా 62 కోట్లు తగ్గింది. మరి బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు జరిగి, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని సరిచేస్తే ఆదాయం పెరుగాలి కదా? ఎందుకు తగ్గింది? దీనికితోడు సర్ చార్జీలు పెంచారు. ఇసుక బజార్లను ఏర్పాటు చేసి అధికారికంగానే టన్నుకు రూ.1,600 ధర ఖరారు చేశారు. ఇసుక తోడే సమయాన్ని రాత్రి 9 గంటల వరకు పెంచారు. అలాంటప్పుడు ఆదాయం ఎంత పెరుగాలి? మరెందుకు పెరగలేదు? సీఐడీ దర్యాప్తు జరుగాల్సింది ఎవరిమీద? కానీ ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపుతో బీఆర్ఎస్ మీద సీఐడీ దర్యాప్తు చేయిస్తున్నది. 2014 నుంచి పదేండ్ల పాటు ఇచ్చిన అన్ని మైనింగ్ లీజులు, అనుమతులు, వ్యవహారాల మీద దర్యాఫ్తునకు ఆదేశాలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతిని దీనిపై విచారణ అధికారిగా నియమించినట్టు తెలిసింది. గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకు కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద భూ కబ్జా కేసు నమోదుకు ఆదేశాలిచ్చింది ఈ అధికారే అన్నది గమనార్హం.
ఆదాయాన్ని పెంచితే కుంభకోణమా?
కుంభకోణం అంటే ఏమిటి? సర్కార్ ఆదాయానికి గండిపెట్టడం. గల్లాపెట్టెను కుట్రపూరితంగా కొల్లగొట్టడం. కానీ పక్కా ప్రణాళికలతో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితే అది కుంభకోణం అవుతుందా? యేటా రూ.10 కోట్లు దాటని ఇసుక ఆదాయాన్ని ఎకాఎకిన ఏడాదికి రూ.800 కోట్ల ఆదాయం చూపెడితే అది కుంభకోణం అవుతుందా? అంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టిలో అది కుంభకోణమే. కేసీఆర్ ఏం పని చేసినా ఆయన కండ్లకు అక్రమాలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇసుక ఆదాయం పెంచినందుకు సీబీసీఐడీ విచారణకు సన్నద్ధం అయ్యారు. అక్రమ మైనింగ్‌తో గల్లాపెట్టెను కొల్లగొడుతున్న పొంగులేటిని వదిలిపెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిన ఇసుక ఆదాయం మీద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీబీసీఐడీ విచారణ వేయబోతున్నారు.
రంగనాయకసాగర్పై విజిలెన్స్ విచారణ
కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు ఇక్కడితో ఆగలేదు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై చేయిస్తామన్న సీఐడీ దర్యాప్తును బీఆర్ఎస్పైకి మళ్లించిన రేవంత్ ప్రభుత్వం కొసరుగా రంగనాయకసాగర్ ప్రాజెక్టుపైనా గురిపెట్టింది. ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల నిర్వాసితులైన కుటుంబాలకు అమలుచేసిన పునరావాస పనుల్లో అక్రమాలు వెలికితీయాలంటూ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రంగనాయకసాగర్ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పనుల్లో, ఫైళ్లలో చిన్న పొరపాటు దొర్లినా పట్టుకురావాలని ముఖ్యమంత్రి ఇరిగేషన్‌శాఖను ఆదేశించినట్టు తెలిసింది. రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సీహెచ్ శ్రుతకీర్తి రంగనాయకసాగర్ చీఫ్ ఇంజినీర్‌కు లేఖ రాశారు.
రంగనాయకసాగర్ ప్రాజెక్టు కోసం సర్వే చేపట్టిన నాటినుంచి ముగింపు వరకు జరిగిన మినిట్ టు మినిట్ నోట్ పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీపీఆర్, పరిపాలనా అనుమతులు, సాంకేతిక అనుమతులు, అగ్రిమెంట్లు, ల్యాండ్ పూలింగ్, లాండ్ అక్విజిషన్, ఎర్త్‌బండ్ డిజైన్, జియోలాజికల్ రిపోర్టు, ఫ్లో డయాగ్రాం, అధికారిక తనిఖీ నివేదికలు, ఎంటైర్ ఆఫీస్ కరస్పాండెన్స్ ఫైళ్లన్నింటినీ పంపాలని ఆదేశించారు. రంగనాయకసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అక్రమాలూ జరగలేదని, పరిపాలనాపరమైన అనుమతులు ఉన్నాయని, జియోలాజికల్ రిపోర్టు ఆధారంగానే ఎర్త్‌బండ్ నిర్మాణం జరిగిందని ఇరిగేషన్ అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. విపక్ష నేతలను ఎలాగైనా ఇరికించాలని భావిస్తున్న ప్రభుత్వం దీంతో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ మీద దృష్టిపెట్టినట్టు సమాచారం. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే నిర్వాసితులకు పరిహారం చెల్లించారా? అందులో ఏవైనా అవకతవకలు జరిగాయా? అనే అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో మైనింగ్‌తోపాటు ఇరిగేషన్ శాఖను కూడా కేసీఆర్, హరీశ్‌రావే నిర్వహించిన సంగతి తెలిసిందే.
మల్సూర్‌ను పక్కన పెట్టుకొని విచారణకా?
రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై, గతంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు చేయిస్తామని సీఎం నిండు సభలో ప్రకటించినప్పుడు.. ఆయనకు ఆ మాటలు రాసిచ్చింది ఎవరు? అక్కడే ఉన్న సీపీఆర్వో మల్సూర్! విశేషం ఏమిటంటే గత ప్రభుత్వంలో మైనింగ్ శాఖ ఎండీగా, వైస్‌ప్రెసిడెంట్‌గా చేసింది ఈ మల్సూరే! ప్రస్తుత ప్రభుత్వ సీపీఆర్వో మల్సూర్ ఆధ్వర్యంలోనే గతంలో మైనింగ్ పాలసీలో కీలక నిర్ణయాలు జరిగాయని ఆ శాఖ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం భావిస్తున్నట్టు ఒకవేళ మైనింగ్ శాఖలో అక్రమాలు జరిగి ఉంటే.. ఆ శాఖ ఎండీగా, వైస్ ప్రెసిడెంట్‌గా మల్సూర్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సీపీఆర్వోగా ఆయనను పక్కన కూర్చోబెట్టుకుని, సీఎం మైనింగ్ శాఖపై దర్యాప్తునకు ఆదేశించడం హాస్యాస్పదంగా ఉన్నదని శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
‘ప్రస్తుతం అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రికి ఆయన అత్యంత సన్నిహితుడు. ఆ మంత్రి సూచన మేరకే అప్పటివరకు సీపీఆర్వోగా ఉన్న అయోధ్యరెడ్డిని తొలగించి, ఇతడిని పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ లో ప్రచారం ఉన్నది. ఇప్పుడు కూడా ఆ మంత్రిని, తద్వారా సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి మైనింగ్‌లో అక్రమాలేవో జరిగినట్టు ఆయన తప్పుడు సమాచారం ఇస్తున్నారని మైనింగ్ శాఖలోని వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ మైనింగ్‌లో అక్రమాలు జరిగాయని భావిస్తే ముఖ్యమంత్రి ముందు తొలగించాల్సింది తన సీపీఆర్వోనే! ఇరిగేషన్ శాఖలో అక్రమాలు జరిగాయంటూ సాగునీటి ఇంజినీర్లపై సోదాలు, విచారణలు జరిపించిప్పుడు, కేసులు పెట్టినప్పుడు, అదే సూత్రం మల్సూర్‌కు ఎందుకు వర్తించదు?’ అని గనుల శాఖలోని ఓ సీనియర్ అధికారి ప్రశ్నించారు.
కొనసాగుతున్న నాదర్గుల్ రైతుల దీక్షలు
నాదర్గుల్లో రైతుల దీక్షలు సోమవారం పదో రోజుకు చేరాయి. రైతులను పొలాల్లోకి వెళ్లనీయకపోవడంతో కోహినూర్ కంపెనీ గేటు ముందు వంటావార్పు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక నిరసనలు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రైతులు భూముల్లోకి వెళ్లకుండా కార్పొరేటర్ కంపెనీలకు ఖాకీలు కాపలా ఉన్నారు. పోలీసుల వ్యవహారశైలిపై రైతులు మండి పడుతున్నారు. మా భూములు మాకు వచ్చేవరకు పోరాటం ఆగదని రైతులు హెచ్చరిస్తున్నారు.
