హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్తు ఉత్పత్తి, ఇతర అవసరాలకు అనుమతులు లేకుండా నీటిని వాడేస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్ ఒఖా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మైశ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కృష్ణా పరీవాహక ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ చెప్పగా, ఇదే అంశంపై విముఖత వ్యక్తంచేస్తూ తెలంగాణ అఫిడవిట్ దాఖలు చేసింది.
రెండు ప్రభుత్వాల అభిప్రాయాలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల న్యాయవాదులు కోరారు. ఈ విషయంలో కేంద్రం నుంచి సూచనలు, ఆదేశాలు తీసుకోవాల్సి ఉన్నదని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటియా కోర్టుకు వివరించారు. తదుపరి విచారణను ఆగస్టు 20కి ధర్మాసనం వాయిదా వేసింది. ఆ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.