హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్‌కు ప్రజల గోడు విని, వారి బాధలు తీర్చే ఓపిక లేదనడానికి ఇదీ ఓ నిదర్శనంగా నిలుస్తున్నది. ఒకటి, కాదు రెండూ కాదు.. ఏకంగా 99 రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనబాట పట్టినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయినా మొక్కవోని దీక్షతో న్యాయం దక్కే వరకు తమ పోరుబాట కొనసాగుతుందని భాగ్యనగర్ టీఎన్జీవో వీనూత్న తరహాలో రోజుకో రీతిన నిరసనలు చేపడుతూ వస్తున్నది. ఆగస్టు 8న తమ భూముల కోసం పోరుబాట పట్టిన ఉద్యోగుల ఆందోళన గురువారం నాటితో వంద రోజులకు చేరుకోనున్నది.
‘న్యాయంగా మాకు దక్కాల్సిన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల చెర నుంచి కాపాడండి మహాప్రభో’ అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ఆ ఉద్యోగుల గోడు సర్కారు చెవులకెక్కడమే లేదు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో 36, 37 సర్వేనంబర్లలోని 189.11 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం ఎపిసోడ్ రావణకాష్టంలా కొనసాగుతూనే ఉన్నది. ప్రభుత్వ పెద్దలు కొందరు రూ.వేలాది కోట్ల విలువైన ఈ సర్కారు భూములను కొల్లగొట్టేందుకు వేసిన వ్యూహానికి తాత్కాలిక బ్రేకులు పడినా ఇంకా ప్రైవేటు వ్యక్తుల చెరలోనే ఆ భూమి ఉన్నది.
ప్రైవేటు వ్యక్తుల ఇష్టారాజ్యం
రంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం సహకారంతో కొందరు ప్రైవేటు వ్యక్తులు 36వ సర్వేనంబరు భూమిని స్వాధీనం చేసుకొని ఏకంగా లేఅవుట్ వేసి 100 ఫీట్ల రహదారిని కూడా నిర్మించారు. దీంతో ఉద్యోగులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే భాగ్యనగర్ టీఎన్జీవో నియమించిన సెక్యూరిటీ గార్డులను రాత్రికి రాత్రే తుపాకులతో బెదిరింపులకు దిగారు.
తీగలాగితే కదిలిన డొంక
‘నమస్తే తెలంగాణ’ ఆరా తీస్తే సర్వేనంబరు 36లో సదరు ప్రైవేటు వ్యక్తులకు జిల్లా కలెక్టర్ 17.04 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇచ్చినట్టుగా తేలింది. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన రిజిస్ట్రేషన్ల ఆధారంగా గతంలో ప్లాట్లు ఉన్నాయనే కారణాన్ని కలెక్టర్ ఎన్వోసీలో చూపారు. కానీ ఉద్యోగులు 2010లోనే అధికారికంగా లేఅవుట్ చేయడం, 2014లో ప్రభుత్వం తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకున్న వాస్తవాన్ని మాత్రం విస్మరించారు. చివరకు ఆ భూములపై హైకోర్టు స్టే ఉన్న విషయాన్నీ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో భాగ్యనగర్ టీఎన్జీవో హైకోర్టును ఆశ్రయించడంతో స్టేటస్కో ఇస్తూ కౌంటర్ అఫిడవిట్ వేయాలని సంబంధిత శాఖలను హైకోర్టు ఆదేశించింది. కానీ 2 నెలలు దాటినా ఇప్పటివరకు అధికార యంత్రాంగం కోర్టుకు సమాధానం చెప్పకపోవడం ఒకవంతైతే, ఆ భూమి తమదేనంటూ ఈ కేసులో ప్రైవేటు వ్యక్తులు ఇంప్లీండ్ కావడం మరో వంతు. ఇలా ప్రస్తుతం గోపన్‌పల్లి భూములపై విచారణ కొనసాగుతున్నది.
బెదరకుండా న్యాయం కోసం పోరుబాట
ఉమ్మడి రాష్ట్రంలో తమతో పాటు వివిధ ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన భూముల్లో ఉద్యోగులు నివాసాలు ఏర్పాటు చేసుకోగా, తమ ఇండ్ల స్థలాల కోసం మాత్రం తాము దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నామని భాగ్యనగర్ టీఎన్జీవో సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ప్రైవేటు వ్యక్తులు బెదిరించినా, ఓ మంత్రి ఒత్తిడి చేసినా, ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు.