నాగిరెడ్డిపేట, నవంబర్ 21: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వర్తించకపోవడంతో.. ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వేసారిన ఓ రైతు, కాంగ్రెస్ కార్యకర్త వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నాడు. తన జీవనోపాధిగా మార్చుకున్న ఆటో వెనుక భాగాన రుణమాఫీ చేయాలంటూ రాసుకున్నాడు. ‘కొంతమంది బీఆర్ఎస్ వాళ్లకి అయ్యింది. నేను కాంగ్రెస్ సభ్యుడిని నాకు రాలేదు. నాకు రుణమాఫీ వెంటనే చేయాలి’ అంటూ తన పేరు వివరాలతో రాయించుకుని హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్నాడు. తన బాధ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చేరే వరకు నిరసన ఇలాగే కొననసాగిస్తానని చెప్తున్నాడు నాగిరెడ్డిపేట మండలం తాండూర్‌కు చెందిన రైతు దివిటి గోపాల్.
గ్రామంలో ఆయనకు 2.30 ఎకరాల భూమి ఉన్నది. దానిపై సొసైటీలో పంట రుణం కింద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఆయనకు వర్తించలేదు. దీంతో అధికారులకు, ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన.. బాధతో తన ఆటోపై ఇలా రాయించుకుని హైదరాబాద్‌లో ఆటో నడుపుకొని బతుకుతున్నట్టు చెప్పాడు. తానూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనేనని, ముఖ్యమంత్రి స్పందించి తనకు రుణమాఫీ చేయాలని కోరాడు. కూతురి పెళ్లి చేసి అప్పుల్లో ఉన్నానని, తనను ఆదుకోవాలని వేడుకున్నాడు. స్థానికంగా అంతా మోసం చేస్తున్నారని.. తన కష్టం, బాధ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చేరే వరకు ఇలాగే నిరసన కొనసాగిస్తానని తెలిపాడు.