హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ఏనాడూ డబ్బును ప్రేమించలేదని, జేబులో ఏనాడూ ఆయన పైసలు పెట్టుకోలేదని తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య పేర్కొన్నారు. కేసీఆర్‌ను తాను చాలా దగ్గరి నుంచి చూశానని, డబ్బే సర్వస్వం అని ఏనాడూ అనుకోలేదని తెలిపారు. ఓసారి తీసుకున్న అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ వ్యక్తి కేసీఆర్‌పై తుపాకి ఎక్కుపెట్టారని గుర్తు చేసుకున్నారు. కన్నబిడ్డ జైల్లో ఉంటే తల్లిదండ్రులకు తీవ్రమైన బాధ ఉంటుందని, కేసీఆర్ ఇదే రకమైన బాధను అనుభవించారని, ఆయన మనసు బాగా లేనప్పుడు ఎవ్వరితోనూ మాట్లాడరని తెలిపారు. మనసు బాగోలేనప్పుడు కేసీఆర్ మౌనం దాలుస్తారని, మౌనమునిలా ఉంటారని చెప్పారు. శుక్రవారం ఇన్నయ్య ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీ అనేక ఆరోపణలు చేస్తున్నాయి. కేసీఆర్‌ను దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా మీ అభిప్రాయం ఏమిటి?
కేసీఆర్ ఇప్పటికీ చాలామందికి అర్థం కాడు. ఆయనతో సుదీర్ఘకాలం నేను ఉన్నాను. 1999 నుంచి కేసీఆర్ నాకు బాగా తెలుసు. 1985 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1987లో కరువుశాఖ మంత్రి, 1997లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. కానీ ఆయన దగ్గర ఏనాడూ డబ్బుల్లేవు. శంషాబాద్‌లో తనకున్న వ్యవసాయ భూమిని అమ్మి నందినగర్‌లో ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కేసీఆర్ కొనుగోలు చేశారు. కేసీఆర్ ఏనాడూ డబ్బును నమ్మడు, డబ్బును ప్రేమించడు, డబ్బే సర్వస్వం అనుకోడు. ఎన్నడూ జేబుల పైసలు పెట్టుకోడు. ఆయన దగ్గర ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టేస్తాడు. ఎవరికైనా ఏమైనా ఆపద ఉన్నదంటే తన దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చే గుణం ఆయనది.
2001 కంటే ముందు టీఆర్ఎస్ పార్టీ పెడుదామని అనుకునే సమయంలోనే కేసీఆర్‌లోని ఈ తత్వాన్ని నేను గ్రహించాను. తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టేనాటికి కూడా కేసీఆర్ దగ్గర నిల్వ ఉండే ధనమేదీ లేదు. కార్యక్రమాలకు ఎక్కడికైనా వెళ్దామంటే హరీశ్‌రావే వచ్చి డబ్బులు సమకూర్చేవాడు. పార్టీ పెట్టిన కొత్తలో ఆయన తన భూములు అమ్మి ఒకసారి రూ. 10 లక్షలు, మరోసారి రూ. 20 లక్షలు ఇచ్చాడు. ఆయనతో రోజులతరబడి హెలికాప్టర్లో తిరిగిన. అయితే అది డబ్బులు ఉండి తిరిగింది కాదు. ఆయన మంచితనం. పార్టీకి వాళ్లు వీళ్లు చందాలుగా ఇచ్చిన డబ్బే. కేసీఆర్ ఆస్తి ఏదైనా ఉందంటే అది ఆయన తీరే. తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటికే ఆయన రెండుసార్లు మంత్రిగా చేసినా డబ్బులు సంపాదించాలని కోరిక లేకపోవడం, నచ్చిన సిద్ధ్దాంతాన్ని నమ్ముకొని పనిచేసుకుంటూ పోవడమేడబ్బులు లేకుండానే రాజకీయ పార్టీ మొదలు పెట్టారంటారా?
అవును. ఆయన సిద్ధాంతం కోసం మొదలుపెట్టారు. చాలా మంది దగ్గర పార్టీ కోసం అప్పులు చేసేవాడు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో ఒక వ్యక్తి తరచూ కేసీఆర్‌కు అప్పులు ఇచ్చేవాడు. ఆయన దగ్గర తీసుకున్న తర్వాత కొంత కాలానికి తీర్చేవాడు. ఇలా జరిగే క్రమంలో ఒకసారి తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం కుదరలేదు. ఆ వ్యక్తి రోజూ ఫోన్లు చేస్తుండడంతో నేను, కేసీఆర్ కలిసి ఆ పెద్ద మనిషి ఇంటికి వెళ్లాం. అక్కడ ఆయన డబ్బులు ఇస్తారా? లేదా? అంటూ రివాల్వర్ ఎక్కుపెట్టిన సందర్భాన్ని నేను మర్చిపోలేను. 2001లో పార్టీ పెట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అద్భుతమైన ఫలితాన్ని సాధించింది. ఇద్దరు జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఉన్నప్పటికీ నిధులు సమకూర్చుకోలేకపోయారు. ఇదంతా తెలియని వారు కేసీఆర్ గురించి ఏదేదో అంటుంటారు. అవన్నీ తప్పు. డబ్బు కోసం రాజకీయాలు చేసే మనస్తత్వం కేసీఆర్‌ది కాదు. ఇది పక్కాగా చెప్పగలను. రాజకీయాల్లో డబ్బు ఒక భాగం మాత్రమేనని అనుకుంటాడు. డబ్బుతో రాజకీయం అనుకునేవాడు కాదు.
రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర గురించి..
తెలంగాణ ఏర్పాటు ఆకాంక్ష అన్నది ఆరు దశాబ్దాలకుపైగా ఉన్నదే. కానే కాదు, రానే రాదనుకున్న తెలంగాణను కేసీఆర్ సాధించాడు. 1971లో 12 ఎంపీ సీట్లలో 11 సీట్లును చెన్నారెడ్డి గెలిపించినా అప్పుడు కూడా తెలంగాణ సాధ్యంకాలేదు. కానీ పార్లమెంటరీ విధానంలో 33 పార్టీలను ఒప్పించి సంతకాలు, లేఖలు, రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టడం ద్వారా తెలంగాణ సాధించే వ్యూహాన్ని రచించి అమలు చేసింది కేసీఆర్ మాత్రమే. 1969 ఉద్యమం మాములు ఉద్యమం కాదు. అనేక మంది బలిదానాలు చేశారు. అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాలేదు.
ఎమ్మెల్సీ కవిత అరెస్టును మీరెలా చూస్తారు?
కవిత నాకు సుమారు రెండున్నర దశాబ్దాలుగా తెలుసు. అమెరికాలో చదువుకుంటున్నప్పడు జరిగిన ప్రమాదం నుంచి నాకు మరింతగా తెలుసు. ఆమె మొండి. మొన్న జైలు నుంచి బయటకు వచ్చినపుడు కూడా ఇదే మాట చెప్పింది. రాజకీయ కారణంతోనే కవితను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారాలని ఆమెను టార్చర్ పెట్టినా ఆమె లొంగలేదు. సీబీఐ, ఈడీ కూడా ఆమెపై అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చి, చివరికి లాభం లేదని అనుకుని ఉండొచ్చు. ఢిల్లీలో వేసవిలో ఎండలు మామూలుగా ఉండవు. జైలులో చాలా దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి. కవిత వాటన్నింటిని తట్టుకొని నిలబడింది. ఇది మామూలు విషయం కాదు.
కేసీఆర్ ఎవరితోను మాట్లాడరని, ఎవరికీ సమయం ఇవ్వడని అంటుంటారు. దీనిపై మీ అనుభవం ఏమిటి?
కేసీఆర్‌ను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. తనకు ఏదైనా బాధ ఉన్నపుడు, మనసు బాగోలేనపుడు ఆయన ఎవరితోను మాట్లాడరు. తనలో తాను అంతర్మథనం చెందుతాడు. తన పంథాను నిర్దేశించుకుంటాడు. ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకొని తనకు నమ్మకం ఏర్పడే వరకు ఎవరితోను మాట్లాడడు. కుటుంబసభ్యులతో మాట్లాడకుండా ఉన్న రోజులు కూడా నేను చూశా. తన అంతర్మథనం పూర్తయినపుడు కొత్త ఆలోచన, కొత్త వ్యూహంతో ప్రజల ముందుకు వస్తాడు. అంతసేపు ఆయన మౌనమునిలా ఉంటాడు. ఎవరు పలకరించినా పలకడు. దీన్ని మనం అర్థం చేసుకొని మెదలాలి. అందుకే ఆయన మౌనంగా ఉన్నపుడు ఎవరూ ఆయనతో మాట్లాడేందుకు సాహసించరు. ఆయనను డిస్బర్బ్ చేయరు. ఇది నా స్వీయ అనుభవం.
రాష్ట్రంలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పాలన, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి పాలనపై మీ అభిప్రాయంపరిపాలనపై ముఖ్యమంత్రికి పట్టులేదు. జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులకు మధ్య సమన్వయం లేదు. పాలనా యంత్రాంగంపై పట్టు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వానికి ఇదో సవాలు. గతంలో కేసీఆర్ ఉన్నపుడు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు.