హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ): ‘హైకోర్టు జడ్జిల నియామకాల్లో తెలంగాణ లాయర్లకు తీరని అన్యాయం జరుగుతున్నది.. ఇతర ప్రాంతాల వారు స్థానికతను తప్పుగా చూపుతూ అవకాశాలను దక్కించుకుంటున్నారు.. ప్రధాన ప్రతిపక్షం తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ వాళ్లకే అవకాశాలు దక్కేలా కృషిచేయండి’ అని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం నాయకులు కేటీఆర్‌కు విజ్ఞప్తిచేశారు. ఆదివారం హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన నివాసంలో సంఘం అధ్యక్షుడు ఎస్ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్‌ను కలిశారు. జడ్జిల నియామకాల్లో కేవలం తెలంగాణ లాయర్ల పేర్లనే పరిగణనలోకి తీసుకోవాలని సంఘం గత జూన్ 15న తీర్మానించిన విషయాన్ని వారు కేటీఆర్‌కు వివరించారు.
జూన్ 17లో హైకోర్టు ఆవరణలో నిరసన తెలిపామని.. నియామకాల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇందుకు కేటీఆర్ స్పందిస్తూ.. తెలంగాణ న్యాయవాదులు లేవనెత్తిన ప్రతి అంశం న్యాయమైనదేనని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో సంఘం ఉపాధ్యక్షుడు డీఎల్ పాండు, కార్యదర్శులు పీ శ్రవణ్‌కుమార్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి పీ కృష్ణ కీర్తన, కోశాధికారి బాలాజీ బానోత్ తదితరులు ఉన్నారు.