సుల్తాన్ బజార్/ కంఠేశ్వర్, మార్చి 10 : శాసనమండలి ఎన్నికల్లో మాజీ మంత్రి షబ్బీర్ అలీకి కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఇవ్వకపోవడంపై ముస్లిం మైనార్టీలు భగ్గుమన్నారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని నెహ్రూపార్కు వద్ద సోమవారం నిరసన తెలిపారు. సీనియర్ నేత షబ్బీర్అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపులో ముస్లిం మైనారిటీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ జిల్లాకు చెందిన ముస్లిం మైనారిటీలు హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ముస్లింలను కాంగ్రెస్ చిన్నచూపు చూస్తున్నదని మండిపడ్డారు. తమ వాయిస్ ఢిల్లీలోని రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు తెలియాలనే గాంధీభవన్ ముందు ధర్నా నిర్వహించామని వారు పేర్కొన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు చేరుకుని ముస్లిం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి అక్కడినుంచి తరలించారు.