Outsourcing Employees | హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేయబోతున్నదా? వివిధ శాఖల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న డీబీఏలను (డాటా బేస్ అడ్మినిస్ట్రేటర్) తొలగింపులకు రంగం సిద్ధం చేసిందా? ఉద్యోగులకు జీతభత్యాల చెల్లింపులకు నగదు కొరత ఉన్నదని సీఎం ప్రకటించిన నేపథ్యంలో కాస్ట్ కటింగ్ పేరుతో చిరు ఉద్యోగులపై వేటు వేస్తున్నారా? ఏజెన్సీల ద్వారా కార్మిక తదితర శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలిగింపులు జరుగుతున్నట్టు సమాచారం. ఆయా శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు పిలుపునిచ్చినట్టు తెలిసింది.
రాష్ట్రంలో కొత్తగా 50 వేల కొలువుల భర్తీ ఏమో కానీ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా ఫైళ్లు కదుపుతున్నట్టు తెలిసింది. జీత భత్యాల చెల్లింపుల్లో నగదు కొరతను నివారించేందుకు వీలైనంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను దశలవారీగా తొలిగించాలని నిర్ణయించినట్టు సమాచారం. 60 ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను గుర్తించి, వారిలో సగం మందిని తొలిగించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. పీఆర్సీ నివేదిక ప్రకారం ఆయా ప్రభుత్వ శాఖల్లో 1,20,367 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. తమ వంతు బాధ్యతగా ప్రభుత్వ పథకాల అమలు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మెడపై రేవంత్ సర్కార్ కక్షగట్టి తీసేస్తున్నదని ఉద్యోగులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడు, ఎందుకు తీసేస్తున్నారనే సమాచారం కూడా ఇవ్వకుండా తొలిగిస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కమర్షియల్ ట్యాక్స్ శాఖలో 75 మందిని తొలిగించడానికి లిస్టు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఉద్యోగాలు తొలిగించి తమ కుటుంబాలను బజారుకు ఈడ్చవద్దని వేడుకుంటూ శుక్రవారం ఆ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. రవాణా శాఖలో మొదటి విడత కింద 62 మందిని తొలిగించడానికి లిస్టు సిద్ధం చేసినట్టు సమాచారం. కార్మిక శాఖలో ఇప్పటికే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలిగింపు మొదలైనదని, కాంట్రాక్టు గడువు ముగిసిన ఉద్యోగుల కాల పరిమితి తిరిగి రెన్యూవల్ చేయకుండా ఇంటికి పంపిస్తున్నట్టు తెలిసింది. తాజాగా మరో 50 మంది ఉద్యోగుల తొలిగింపునకు నివేదిక రూపొందించినట్టు సమాచారం. ఎక్సైజ్ శాఖ, టీజీబీసీఎల్ నుంచి 80 మంది ఉద్యోగులను తొలిగించడానికి అధికారులు లిస్టు సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.