హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం సంగతి దేవుడెరుగు.. కనీసం పది నిమిషాలు కూడా పార్టీ నాయకులు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు, పార్టీ బలోపేతం లక్ష్యంగా గాంధీభవన్ వేదికగా పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన గ్రేటర్ కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. కార్పొరేటర్లు, నియోజకవర్గ ఇన్చార్జీల మధ్య సమన్వయ లోపం బయటపడింది. హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ డీసీసీలతో జరిగిన సమావేశంలో ఒకరిపై ఒకరి ఫిర్యాదులు చేసుకున్నారు.
అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా, గ్రేటర్లో కాంగ్రెస్ ఉనికి లేకపోవడంతో డీసీసీ నేతలపై పార్టీ అగ్రనేతలు అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఒకానొక సందర్భంలో.. ‘మనం పిలిస్తే, కనీసం పది మంది కూడా వచ్చే పరిస్థితి లేదు’ అని గ్రేటర్ నేతలతో మహేశ్‌గౌడ్ వ్యాఖ్యానించడం గమనార్హం. సమావేశం జరుగుతున్న క్రమంలోనే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి… ‘యూ డాగ్స్’ అంటూ చేసిన వ్యాఖ్యలు గ్రేటర్ నేతల మధ్య అగ్గి రాజేసింది. మేయర్ వ్యాఖ్యలపై కార్పొరేటర్లు, నియోజక ఇన్చార్జీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకరినొకరు దూషించుకుంటూ బాహాబాహీకి దిగారు.
గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలింది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నామని ఒక వర్గం, పార్టీ మారిన నేతలు మరో వర్గంగా పీసీసీ చీఫ్ ముందే వాదోపవాదనలకు దిగారు. ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఆదం సంతోష్, వినోద్, పీజేఆర్ కూతురు విజయారెడ్డి తదితరులు ఒక వర్గంగా, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ మరో వర్గంగా చీలి పరస్పర వాదనలకు దిగారు. పార్టీని తామే నడిపిస్తున్నామంటూ మేయర్ వర్గం వాదించడంతో విజయారెడ్డి వర్గం తీవ్రంగా ఖండించింది. దీంతో ఇరు వర్గాల నేతల మధ్య ఘాటైన వ్యాఖ్యలతో గాంధీభవన్ వేడెక్కింది. ఈ సందర్భంలోనే ‘యూ డాగ్స్’ అంటూ మేయర్ వ్యాఖ్యానించడం మరింత రచ్చకు దారితీసింది. పరిస్థితులను చక్కబెట్టేందుకు స్వయంగా ప్రభుత్వ సలహాదారు, పార్టీ సీనియర్ నేత కే కేశవరావు జోక్యం చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. చివరకు అనుకున్న లక్ష్యాలపై చర్చించకుండానే సమావేశాన్ని ముగించాల్సి వచ్చింది.
ముఖ్యంగా డీసీసీ నాయకులు కేవలం అగ్రనేతల పర్యటనలు ఉన్నప్పుడే తళుక్కుమంటూ, ఆ తర్వాత జెండా మోసిన కార్యకర్తలను పట్టించుకోవడమే లేదని నేరుగా పీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీలో కేవలం పదవులు అనుభవించేందుకే అన్నట్టుగా వ్యవహరిస్తున్న కొంతమంది జిల్లా అగ్రనేతల తీరుపై విస్తృతంగా చర్చించుకున్నారు. కనీసం పార్టీ సమావేశాలకు జనాలను తరలించలేకపోతున్నారని, గ్రేటర్ నేతలపై నమ్మకం లేకనే జిల్లాల నుంచి తరలించాల్సి వస్తున్నదని వాపోయారు. మూడు జిల్లాల డీసీసీలు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం సరికాదని పీసీసీ చీఫ్, ఏఐసీసీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. ఖైరతాబాద్ డీసీసీ నేత రోహిన్‌రెడ్డి వ్యవహార శైలిపై పీజేఆర్ కూతురు విజయారెడ్డి ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ డీసీసీ నేత ఆదం సంతోష్‌కుమార్‌పై మరికొందరు ఫిర్యాదు చేశారు.