Telangana | పటాన్చెరు, ఆగస్టు 20: నాడు పవర్ హాలిడేలతో వారానికి రెండు రోజులే పరిశ్రమలు నడిస్తే.. నేడు 24 గంటల విద్యుత్తుతో రోజుకు మూడు షిప్టుల్లో పనులు నడుస్తున్నాయని సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి చందుకుమార్ పొట్టి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ విజన్‌తో తెలంగాణ ఏర్పడ్డాక కేవలం ఆరునెలల్లోనే విద్యుత్తు సమస్యకు పరిష్కారం లభించిందని అంటున్నారు. నిరంతర కరెంట్, రాష్ట్ర సర్కారు పాలసీలతో తెలంగాణలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నదని చెప్తున్నారు. ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
పరిశ్రమలకు ఇప్పుడు విద్యుత్తు సరఫరా ఎలా ఉన్నది?
తెలంగాణ సర్కారు సంగారెడ్డి జిల్లా పరిధిలో 24 గంటల నాణ్యమైన కరెంట్‌ను అందిస్తున్నది. ఇప్పుడు పరిశ్రమల్లో మూడు షిప్టులు పనులు నడుస్తున్నాయి. నా పరిశ్రమ ఉన్న పాశమైలారంలోనైతే గంటపాటు కూడా కరెంటు కోత ఉండడం లేదు.
సమైక్య రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా ఎలా ఉండేది?
2013లో వారంలో రెండు, మూడు రోజుల విద్యుత్తు కోతతో మేం నష్టాల పాలయ్యాం. పారిశ్రామికవేత్తలం అందరం కలిసి దిక్కులేని పరిస్థితిలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ముందు ధర్నాలు చేశాం. దేశంలో ఎక్కడా పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసిన ఉదంతాలు చూడలేదు. ఇప్పుడు తెలంగాణలో నిరంతరం విద్యుత్తు సరఫరాతో పరిశ్రమలు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రెడిట్ అంతా సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది.
విద్యుత్తు రంగంలో ఇంకా ఏమైనా మార్పులు, సంస్కరణలు అవసరమా?
ప్రస్తుతం మాకు కావాల్సినంత విద్యుత్తు సరఫరా ఉన్నది. పాశమైలారం ఐడీఏకు ఇప్పుడున్న 33కేవీ లైన్‌తోపాటు ఆల్టర్నెట్ లైన్‌ను అమర్చారు. ఏ పరిశ్రమకూ విద్యుత్తు సమస్య లేదు. పవర్ అంటే పరిశ్రమలకు హార్ట్ లాంటిది. నిరంతరం విద్యుత్తు ఉంటేనే పరిశ్రమలు నడుస్తాయి. ఇప్పుడు పరిశ్రమలు 3 షిఫ్టుల్లో నడుస్తున్నాయి. కార్మికులకు కావాల్సినంత పని దొరుకుతున్నది. ఓటీలు లభిస్తున్నాయి. ఆర్డర్ తీసుకొన్న మాకు సకాలంలో వాటిని పూర్తి చేసిచ్చే సామర్థ్యం సమకూరింది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో తెచ్చిన సంస్కరణలపై మా పారిశ్రామికవేత్తలం ఎంతో సంతృప్తిగా ఉన్నాం. పవర్ విషయంలో సీఎం కేసీఆర్ భేష్. ప్రభుత్వ సహకారంతో ఇక్కడి కూలీలతో పాటు ఇతర రాష్ర్టాల కూలీలకు మేం పెద్ద ఎత్తున ఉపాధి చూపగలుగుతున్నాం.
తెలంగాణ విద్యుత్తు రంగంలో సక్సెస్ అవుతుందని అనుకున్నారా?
2014లో సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని బేగంపేటలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. మూడేండ్ల టైం ఇస్తే తప్పకుండా నాణ్యమైన కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆ హామీని సీఎం కేసీఆర్ ఏడాదిలోపే నిలుపుకోవడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఏడాదిలోపే మా పారిశ్రామికవాడలకు నాణ్యమైన విద్యుత్తు ఎలాంటి కోతలు లేకుండా సరఫరా చేశారు.