హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/చార్మినార్: అడవుల రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలను మరువొద్దని, వారి ఆశయాలకు అనుగుణంగా అటవీశాఖ సిబ్బంది పనిచేయాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్ స్మారకచిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించా రు. అనంతరం ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడు తూ.. విధి నిర్వహణలో అటవీశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో 1984 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 22 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. భద్రాది కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గత నవంబర్ 22న గొత్తికోయల చేతిలో ప్రాణాలు కొల్పోయారని, అడవుల సంరక్షణ కోసం ఆయన చేసిన త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడిందని, సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో శ్రీనివాసరావు సతీమణి నాగలక్ష్మికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగంతోపాటు రూ.50 లక్షలు, ఇంటి స్థలం ఇచ్చారని గుర్తుచేశారు.
అటవీ రక్షణకు ప్రాధాన్యం
అటవీశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వివరించారు. 2022-23లో అటవీశాఖ అధికారులు స్మగ్లర్లపై 79,735 కేసులు నమోదు చేసి, రూ.43.56 కోట్ల జరిమానా విధించారని తెలిపారు. 15,122 వాహనాలను జప్తు చేశామని, 12,019 అటవీ భూ ఆక్రమణ కేసులు నమోదుచేసినట్టు వెల్లడించారు. చెట్ల నరికివేతపై 26,408 కేసులు నమోదుచేసి రూ.57.81 కోట్ల విలువైన కలపను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అటవీశాఖను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తున్నదని చెప్పారు. 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, 14 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని వివరించారు. ‘జంగిల్ బచావో-జంగిల్ బడావో’ నినాదం ద్వారా ఇప్పటికే ఉన్న అడవుల రక్షణతోపాటు క్షీణించిన అడవుల పునరుజ్జీవనం కోసం పెద్దఎత్తున చర్యలు తీసుకొంటున్నట్టు వెల్లడించారు. హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 290 కోట్లకు పైగా మొకలను నాటినట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఆదివాసీ, గిరిజన బిడ్డలకు భూమిహకు కల్పిస్తూ పోడుపట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారని వివరించారు. పోడు భూముల సమస్య పరిషారం వల్ల గిరిపుత్రులకు, అటవీశాఖ సిబ్బందికి మధ్య ఘర్షణ వాతావరణాన్ని నివారించగలిగినట్టు చెప్పారు. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్, వన్యప్రాణుల ముఖ్య సంరక్షణ అధికారి లోకేశ్‌జైస్వాల్, ఎఫ్డీసీ వీసీ, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, జూపార్ డైరెక్టర్ ఎస్వీఎన్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.