Oil Palm | నిజామాబాద్, మే 20 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ఇందూరు జిల్లా ఇప్పుడు నూనె గింజల సాగులోనూ ప్రత్యేకతను చాటుకుంటున్నది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో రైతు మార వెంకట్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 2022లో నాటిన ఆయిల్ పాం మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరిగి గెలలు వచ్చాయి. గురువారం ఆయిల్‌పాం గెలలను కోసేందుకు ఉద్యాన శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యానశాఖ ద్వారా ఉద్యమం మాదిరిగా నూనె గింజల సాగుకు ప్రోత్సాహం అందించారు. తద్వారా ఆదర్శ రైతులు చాలామంది ముందుకు వచ్చారు. సాగులో మెలకువలు నేర్చుకుని ఆయిల్ పాం మొక్కలు నాటారు. అవి ఇప్పుడు ఆదాయ మార్గాన్ని సృష్టిస్తున్నాయి. నాలుగేండ్ల రైతు శ్రమకు ఫలితమే అంకాపూర్‌లో గురువారం కనిపించనున్నది. కేసీఆర్ స్ఫూర్తితో 2022లో 2,632 ఎకరాల్లో, 2023లో 1,982 ఎకరాలు, 2024లో 989 ఎకరాల్లో మొత్తం జిల్లాలో 5,604 ఎకరాల్లో ఆయిల్ పాం సాగుకు నోచుకున్నది.
నూనె గింజల సాగుపై బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను అందించింది. దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఆయిల్‌పాం సాగును పెద్ద ఎత్తున సాగు చేసేందుకు కేసీఆర్ నిర్ణయించారు. ఆయిల్ పామ్ సాగుకు అంగీకారం తెలిపిన వారిని గుర్తించి శిక్షణ ఇప్పించారు. ఆర్మూర్ మండలం చేపూర్ శివారు నర్సరీలో మొక్కలు సిద్ధం చేసి ఔత్సాహికులకు అందించారు. జిల్లావ్యాప్తం గా ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు ముందుకురాగా, ప్రయోగాత్మక సాగు దిగ్విజయమై పం ట కోత దశకు చేరింది. జిల్లాలో ఆయిల్ పాం సాగు చేసే రైతులతో ప్రియూనిక్ ఇండియా లిమిటెడ్ కంపెనీ బైబ్యాక్ ఒప్పందం చేసుకున్నది. ఈ సంస్థ చేపూర్లో ఆయిల్‌పాం మొ క్కలను పెంచేందుకు నర్సరీని నిర్వహించిం ది. ఇప్పుడు అంకాపూర్‌లో రైతు మార వెంకట్‌రెడ్డి క్షేత్రం నుంచి గెలలను కోసి నూనె తయారీకి ఇదే కంపెనీ ఏర్పాట్లు చేస్తున్నది.
నిజామాబాద్ జిల్లాలో ఆయిల్‌పాం సాగును కేసీఆర్ ప్రభుత్వం ప్రోత్సహించింది. అనేక రాయితీలు, డ్రిప్ సహకారం అందించింది. భూములు సారవంతంగా ఉండటం.. పసుపు పండించిన నేల కావడం, నీరు సమృద్ధిగా అందుబాటులో ఉండటంతో గెలలు 36 నెలల్లోనే చేతికి వచ్చాయి. జిల్లాలో ఆయిల్ పాం సాగు చేసి తొలి పంటను విక్రయిస్తున్న మొదటి రైతును నేనే కావడం సంతోషంగా ఉంది.
– మార వెంకట్‌రెడ్డి, ఆయిల్‌పాం రైతు
ఆయిల్ పాం సాగు చేసిన రైతుకు లాభాలు అందించడమే ధ్యేయంగా బైబ్యాక్ ఒప్పందాలను గత సర్కారు కుదిర్చింది. నిజామాబాద్ జిల్లాలో 2022లో 2,600 ఎకరాల్లో సాగు చేశారు. ఇప్పుడు మూడేండ్లు పూర్తయ్యింది. ఆయిల్‌పాం గెలలను బైబ్యాక్ ఒప్పందంలో భాగంగా నేరుగా ప్రియూనిక్ కంపెనీయే కొనుగోలు చేస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరనే రైతులకు చెల్లిస్తాం. ఇందులో మధ్యవర్తిత్వం ఉండదు. మోసానికి తావు లేదు.
– రోహిత్, ప్రీయూనిక్ కంపెనీ, నిజామాబాద్ జిల్లా మేనేజర్