Indiramma Indlu | బయ్యారం, ఫిబ్రవరి 4: ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు వెనక్కి తీసుకోవడంతో లబ్ధిదారుల్లో ఆయోమయం నెలకొంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడును పైలట్ గ్రామపంచాయతీగా అధికారులు ఎంపిక చేశారు. గత నెల 26న గ్రామంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య లబ్ధిదారులకు మంజూరుపత్రాలు అందజేశారు. ధర్మపురంలో 40 మందికి, రాయికుంటలో 32, నామాలపాడులో 42 మందికి మొత్తం 114 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అధికారులు అందించారు.
పది రోజులు గడవకే మందే ఇచ్చిన మంజూరు పత్రాలు జీపీ సిబ్బంది వెనక్కి తీసుకున్నారు. ఇంటింటికీ తిరుగుతూ మంజూరు పత్రాలు ఇవ్వాలని జీపీ సిబ్బంది అడగడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులను వివరణ కోరగా లబ్ధిదారుల సంతకాలు తీసుకోలేదని, వాటి కోసం వెనక్కి తీసుకుంటున్నామని, మళ్లీ అందజేస్తామని సమాధానం చెప్పడం గమనార్హం.