Indiramma Illu | అమ్రాబాద్, మే 8 : పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి ఆ తరువాత ఎంపిక జాబితాలో నుంచి పేర్లు తొలగించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావడం వల్లే ఇండ్లు మంజూరు చేయడం లేదని కాంగ్రెస్ నా యకులు బహిరంగంగా చెప్పడం గమనార్హం. అయితే సదరు బాధితులు సైతం ఇండ్లు లేకపోయినా పర్వాలేదు కానీ తాము బీఆర్ఎస్ను వీడేది లేదంటూ స్పష్టం చేయడం గమనార్హం.
వివరాలు ఇలా.. తుర్కపల్లి గ్రామానికి చెందిన ఆ ర్మూర్ లక్ష్మమ్మ, సంగీ బాలమ్మకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఇటీవల ప్రొసీడింగ్ పత్రాలు కూడా అందజేశారు. తాజాగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితాలో నుంచి వారి పేర్లను తొలగించారు. విషయం తెలుసుకున్న సదరు మహిళలు గురువారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తుర్కపల్లికి చేరుకొని బాధితులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తుర్కపల్లిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి ఫొటోలతో ఉన్న ప్రొ సీడింగ్ పత్రాలను అందించిన తర్వాత లిస్టులో పేరు రాలేదని పేర్కొన్నారు. ఇదే విషయమై వారు కాంగ్రెస్ పెద్దలను అడిగితే.. ‘మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కాదు. అందువల్ల మీ పేర్లు లిస్టులో లేవు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారితే మీకు ఇండ్లు ఇస్తాం’ అని చెప్పినట్టు బాధితులు లక్ష్మమ్మ, బాలమ్మ గువ్వల దృష్టికి తీసుకొచ్చారు. తమకు ఇండ్లు ఇవ్వకపోయిన పర్వాలేదని, బీఆర్ఎస్లోనే ఉంటామని చెప్పారు.