హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు పెన్షన్‌తోపాటు అనారోగ్యం పాలై, ప్రమాదాలకు గురై వృత్తి నిర్వహించలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు శుక్రవారం నాంపల్లిలోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చెకులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రెస్ అకాడమీ భవనాన్ని చిన్నచిన్న మరమ్మతులు పూర్తి చేసి నెలాఖరులోగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
విడతలవారీగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.42 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమం కోసం అకాడమీ ఖర్చు పెడుతున్నదని వెల్లడించారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన 597 మందికి రూ.లక్షతోపాటు ఐదేండ్ల వరకు నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్, 1 నుంచి 10వ తరగతి వరకు చదివే వారి పిల్లలకు ట్యూషన్ ఫీజుల కింద నెలకు రూ.1,000 చొప్పున అందిస్తున్నట్టు తెలిపారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు పెంచాలని కోరారు.
రాష్ట్రంలోని రైతాంగానికి మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా సర్వే, సెటిల్మెం ట్, ల్యాండ్ రికార్డ్స్ విభాగాలను మరింత బలోపేతం చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. శుక్రవారం సచివాలయంలో సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ శాఖపై సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 420 మంది మాత్రమే లైసెన్స్డ్ సర్వేయర్లు ఉన్నారని, కొత్తగా సుమారు ఐదువేల మందిని నియమిస్తామని వెల్లడించారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.
ఇంటర్లో గణితం సబ్జెక్టు కలిగి 60% మార్కులతో ఉత్తీర్ణులైన ఐటీఐ డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్), డిప్లొమా (సివిల్), బీటెక్ (సివిల్) ఇతర సమానమైన అర్హతలు కలిగినవారు అర్హులని పేర్కొన్నారు. అర్హులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని చెప్పారు. శిక్షణ ఫీజు ఓసీలు రూ.10 వేలు, బీసీలు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.