కరీంనగర్, జూన్ 7 (నమస్తేతెలంగాణ ప్రతినిధి/పాలకుర్తి) : ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా అర్హులకే ఇస్తాం.. ఎవరూ ఎటువంటి అక్రమాలకు పాల్పడినా సహించేది లేదంటూ ఊదర గొట్టే మాటలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. నిబంధనలకు పాతరేసి.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పిన వారినే ఎంపిక చేస్తున్నారు. నిబంధనలను ప్రభుత్వం తుంగలో తొక్కడంతో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం లేదు. దీనికి నిలువెత్తు నిదర్శనం.. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామంలోని పలువురు నిరుపేదలే.
మా గుడిసెలు కనపడలేదా?
పుట్నూర్ గ్రామంలో 30 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్టు అధికారులు చెప్తున్నారు. నిబంధనల ప్రకారం ముందు వరుసలో ఉండాల్సిన నిరుపేదలకు మాత్రం జాబితాలో అవకాశం దక్కలేదు. ఏండ్ల తరబడి గుడిసెల్లోనే ఉంటున్న వారిని పక్కన పెట్టారు. గ్రామ సభలు జరిగినప్పుడు.. సదరు నిరుపేదలకు మంజూరు అయినట్టు పేర్లు చదివిన అధికారులు తీరాచూస్తే.. పైనుంచి జాబితా వచ్చిందని చెప్తున్నారు. ‘మేము ఉంటున్న తాటికమ్మల గుడిసెలు.. తడువకుండా వేసుకున్న కవర్లు.. ఇల్లు లేక అష్టకష్టాల పడుతున్న తీరు.. సర్వేకు వచ్చినప్పుడు కాళ్లా వేళ్లా పడి ఈసారైనా మాకు న్యాయం చేయండి’ అంటూ వేడుకున్నంటున్న మా దీన స్థితి.. సర్వేకు వచ్చిన అధికారులకు కనబడలేదా? అని పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామ నిరుపేదలు ప్రశ్నిస్తున్నారు.
గ్రామంలోని పలు కుటుంబాలు కఠిక పేదరికంతో గుడిసెల్లో ఉంటున్నారని తెలిపారు. నిజానికి తమకంటే గ్రామంలో నిరుపేదలు ఉండరని, పైఅధికారులు వచ్చి చూస్తే అన్నీ తెలుస్తాయని వారంటున్నారు. గ్రామ సభలు జరిగినప్పుడు.. తమ పేర్లున్నాయని చెప్పి.. ఇప్పుడు తమ పేర్లు కనిపించకుండా చేశారని వారు భగ్గుమంటున్నారు. డబ్బులుర ఉన్నోళ్లకు, భూములున్నోళ్లకు, చోటామోటా నాయకులకు, డబ్బులు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని ఆరోపిస్తున్నారు. గ్రామానికి 30 ఇండ్లు వస్తే.. ముందుగా ఉండాల్సిన తమ పేర్లు లేకపోవడం ఎంపికలో ఎంత అన్యాయం జరిగిందో చెప్పడానికి నిదర్శనమని అంటున్నారు. నాకు ముగ్గురు ఆడపిల్లలు.. కనికరించండి
ఎన్నికల్లో చేతిగుర్తుకు ఓటేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. చేతిగుర్తుకు ఓటేసినా మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు. ముగ్గురు ఆడపిల్లలతో కూలి పని చేసుకుని బతుకుతున్న. ఊళ్లో నాకంటే పేదవాళ్లు ఎవరూ లేరు. బాగా ఉన్నోళ్లకు ఇండ్లు ఇచ్చిండ్రు. గ్రామంలో 30 మందికి ఇండ్లు ఇస్తే నాలాంటి పేదోళ్లకు మాత్రం రాలేదు. ఈ విషయాన్ని కలెక్టర్కు కూడా చెప్పినం. ఒకసారి మా గ్రామానికి వచ్చి మేం చెప్పేది నిజమో కాదో చూస్తే తెలుస్తుంది. గ్రామ సభల్లో మేం ఎంపికైనట్టు చెప్పిండ్రు. ఇప్పుడు అడిగితే మాత్రం మా చేతుల్లో ఏమీ లేదు.. అంతా పైనుంచి వచ్చిందని చెపుతుండ్రు. పోనీ మాకెప్పుడు ఇస్తరో చెప్పుండ్రి అంటే చెప్తలేరు. పేదోళ్లకు ఇస్తమని చెప్పి.. పెద్దోళ్లకు, కాంగ్రెసోళ్లకు ఇస్తుండ్రు. కలెక్టర్, అధికారులు వచ్చి చూసి మాకు న్యాయం చేయాలి.
– దుర్గం లక్ష్మి, పుట్నూర్
అప్పుడున్న పేరు ఇప్పుడేమైనట్టు?
ఇందిరమ్మ ఇండ్ల కోసం అందరిలాగే దరఖాసు ్తచేసుకున్నం. గ్రామ సభరోజు మా పేరు చదివిండ్రు. మాకు ఇల్లు వచ్చిందన్నరు. ఇప్పుడు మాత్రం లేదంటున్నరు. గ్రామ పంచాయతీ అధికారులను అడిగితే.. పై నుంచే పేర్లు వచ్చినయి.. మమ్మల్ని ఏమి జేయమంటరు? అంటుండ్రు. మాకేమి సంబంధం లేదంటుండ్రు. గ్రామంలో మా కంటే పేదవారు ఎవరూ లేరు. ఆర్థికంగా ఉన్నవాళ్లకు, నాయకుల దగ్గరోళ్లకు మాత్రం ఇండ్లు ఇచ్చిండ్రు. మేమేం పాపం జేసినమని మాపేర్లు ఎందుకు తొలగించిండ్రో చెప్పాలె.
-దండుగుల లక్ష్మి, కూలి, పుట్నూర్
దివ్యాంగుడినైనా ఇల్లు ఇవ్వలేదు
నాకు 90 శాతం అంగవైకల్యం ఉంది. చెయ్యిలేదు. కాళ్లులేవు. మంచంలో ఉన్న. పూరిగుడిసెలో ఉంటున్న. నేను ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న. మొదట నాకు ఇల్లు వచ్చిందని చెప్పిండ్రు. సర్వే తర్వాత నా పేరు తొలగించిండ్రు. అర్హత ఉన్నప్పటికీ అధికారులు, నాయకులు కుమ్ముక్కై నాకు ఇల్లు ఇవ్వలేదు. కలెక్టర్ సార్ చొరవచూపి గ్రామంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. నాయకులు చెప్పినవారిని కాకుండా గుడిసెల్లో ఉంటున్న వారిని గుర్తించి న్యాయం చేయాలె.
– కాల్వ తిరుపతి, పుట్నూర్
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం ; కామారెడ్డి జిల్లా లో ఘటన
లింగంపేట, జూన్ 7: ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని సంతోషపడ్డాడు. ఇల్లు కట్టుకునేందుకు డబ్బుకు ఇబ్బంది రావొద్దని పొలం అమ్మేశా డు. తీరా లబ్ధిదారుల జాబితాలో పేరులేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కోర్పోల్లో జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. కోర్పోల్కు చెందిన నర్సని కాశీరాంకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, మొదటి జాబితాలోనే పేరు వచ్చిందని స్థానిక కాంగ్రెస్ నాయకులు సమాచారం ఇచ్చారు. సంతోషపడ్డ కాశీరాం.. అధికారులు వచ్చి మార్కింగ్ చేస్తారన్న నమ్మకంతో తన గుడిసెను తొలగించి స్థలం చదును చేశాడు. ఇంటి నిర్మాణ సమయంలో డబ్బులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా తనకున్న ఎకరం భూమిలో అర ఎకరం విక్రయించాడు. తీరా తుది జాబితా లో పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురై శనివారం గడ్డిమందు సేవించాడు. కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు.