Volunteers | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న వలంటీర్లాంటి వ్యవస్థ తెలంగాణలోనూ రాబోతున్నదా? అది కాంగ్రెస్ కార్యకర్తలకు ఉపాధిగా మారబోతున్నదా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. తాము అధికారంలోకి వస్తే కార్యకర్తలను వలంటీర్లుగా నియమిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి విస్పష్టంగా చెప్పారు. ఇప్పుడు దీనిని అమలు చేయబోతున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే ‘ఇందిరమ్మ కమిటీ’లను ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైనట్టు సమాచారం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు.
ఆరు గ్యారెంటీల అమలు, కార్యకర్తలకు ఉపాధి కల్పన, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటివాటికి సంబంధించి ప్రభు త్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. వలంటీర్ల నియామకంలో భాగంగానే ‘ఇందిరమ్మ కమిటీ’లను తెరపైకి తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతున్నది. ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని బుధవారం జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ సీనియర్ నేత మల్లు రవి స్వయంగా ప్రకటించారు. ఈ కమిటీలో ఐదు నుంచి ఆరుగురు సభ్యులుంటారు. వీరంతా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులేనని కూడా ప్రకటించారు. దీనినిబట్టి చూస్తే ఇది పక్కాగా వలంటీర్ వ్యవస్థేనని తేలిపోయింది. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో వలంటీర్లను నియమించి వీటిని కూడా ఉద్యోగాల ఖాతాలో కలిపేస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు, 142 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ లెక్కన దాదాపు 80వేలమంది వలంటీర్లను నియమించాల్సి ఉంటుంది. కాబట్టి మరో 1.20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా 2 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకున్నామని చెప్పే వ్యూహం అందులో దాగి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఏపీలో ఒక్కో వలంటీర్‌కు రూ. 5 వేల చొప్పున గౌరవ వేత నం ఇస్తుండగా, రేవంత్ ప్రభుత్వం ఎంత ఇస్తుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.