కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 10: రాష్ట్రంలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు (Mahila Shakti Canteens) ప్రారంభించి ప్రతీ మహిళను కోటీశ్వరురాలును చేస్తా.. ప్రతీ మహిళకు రుణసదుపాయం కల్పిస్తా.. వారందరికీ అండగా ఉంటా, ఆదుకుంటా.. ఇది సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాట. ఈ మాట నిజమే కానీ.. క్షేత్రస్థాయిలో ఇవన్నీ ఉత్తమాటలుగానే మిగిలాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో సుమారు రూ.20 లక్షల వ్యయంతో మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి జిల్లా ప్రభుత్వ దవాఖాన వెంట స్ట్రీట్ వెండర్ జోన్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. స్ట్రీట్ వెండర్ జోన్‌కు కొంచెం సొబగులద్ది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వ్యాపార నిర్వహణకు కేటాయిస్తూ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు (ఫుడ్ కోర్టు)గా నామకరణం చేసింది. ఈ ఫుడ్ కోర్టును రాష్ట్ర మంత్రులు ఘనంగా ప్రారంభించి మహిళలను తమ కాళ్లమీద నిలబడేలా చేశామని గొప్పలు చెప్పుకున్నారు.
సుమారు రూ.20 లక్షలతో 20 షాపులు నిర్మించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకే ఈ ఫుడ్ కోర్టులను కేటాయించారు. టిఫిన్స్, బ్రెడ్ ఆమ్లెట్, ఫాస్ట్ ఫుడ్, నూడుల్స్, పచ్చళ్ళు, పిండి వంటలు, చికెన్ పకోడి, చపాతి, తదితరాలు ఈ ఫుడ్ కోర్టులో మహిళా సభ్యులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కనీసం రుణసదుపాయం చేయకపోయినా బయట నుంచి అప్పులు తీసుకువచ్చి మహిళా సభ్యులు వ్యాపార కార్యాకలాపాలు సాగించారు. కానీ అనుకున్నంతగా ఇక్కడ వ్యాపారాలు సాగక అనేక మంది నష్టపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రూ.500లు కూడా గిరాకీ కావడం లేదని మహిళా సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో చేసేదేమీలేక, తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. అలాగని నష్టాలకు వ్యాపారాన్ని నిర్వహించలేక ఇబ్బందులుపడుతున్నారు. మొత్తం 20 షాపుల్లో కేవలం ఆరు షాపుల్లోనే టిఫిన్ సెంటర్, కర్రీ పాయింట్‌ను నిర్వహిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ ఇటీవల ఫుడ్ కోర్టులో మేకపాలను ప్రారంభించేందుకు వచ్చారు. ఆ రోజే షాపులన్నీ కళకళలాడాయి. వ్యాపారం ఏ విధంగా నిర్వహిస్తున్నారో అడిగి తెలుసుకొని తగిన సలహాలు, సూచనలు చేశారు. ప్రజా ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారుల పర్యటన అపుడు మాత్రమే ఇవి తెరుచుకున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఫుడ్ కోర్టు నిర్వహకుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయింది. అటు షాపును నిర్వహించలేక, ఇటు మూయలేక ఆర్థికంగా అవస్థలుపడుతూనే ఉన్నారు. ఇక నూడుల్స్, టిఫిన్ సెంటర్ వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ పుడ్ కోర్టు నిర్వహకులకు తాగేందుకు నీరు లేక, విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులుపడుతున్నారు. సాయంత్రం వేళ మాత్రమే సౌర విద్యుత్‌ను వినియోగించాలని సంబంధిత అధికారులు ఆదేశించడంతో ఉదయం వేళ నిర్వహిస్తున్న మూడునాలుగు షాపుల నిర్వహకులు కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ ఫుడ్ కోర్టుల నిర్వహణ అంశంపై మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ కే. సుజాతను వివరణ కోరగా ఫుడ్ కోర్టులో కేటాయించిన షాపుల నిర్వహకులతో మాట్లాడి, సమస్యలు తెలుసుకొని యాధావిధిగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.