హైదరాబాద్ సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్‌లో మెరుపు దాడులు నిర్వహించడంతో కేంద్రం గగనతలంలో ఆంక్షలు విధించింది. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలు సేవలను నిలిపివేశాయి. ఉత్తరాదిలోని శ్రీనగర్, జమ్ము, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల, బికనీర్, జోధ్‌పూర్, గ్వాలియర్ కు విమానాల రాకపోకలను నిలిపివేశారు. హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన 8 ఫ్లైట్లను, హైదరాబాద్‌కు రావాల్సిన మరో 8 ఫ్లైట్లను రద్దు చేసినట్టు ఇండిగో ఎయిర్‌లైన్స్ తెలిపింది. 2 విమానాల రాకపోకలను నిలిపివేసిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. అమృత్‌సర్‌కు వెళ్లాల్సిన 2 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఢిల్లీకి మళ్లించినట్టు వెల్లడించింది. ధర్మశాల, లేహ్, జమ్ము, శ్రీనగర్, అమృత్‌సర్‌కు విమాన రాకపోకలు నిలిపివేస్తున్నట్టు ‘స్పైస్‌జెట్’ సంస్థ కూడా ప్రకటించింది.