హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): కిర్గిస్థాన్ రాజధాని బిషెక్‌లో భారతీయ విద్యార్థులపై జరిగిన దాడులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. రాష్ట్ర ఉన్నతాధికారులు బిషెక్‌లోని భారత రాయబారి అరుణ్ కుమార్ ఛటర్జీని సంప్రదించి వివరాలు సేకరించారు. భారతీయ విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో స్పందించడానికి ఎంబసీ హెల్ప్ లైన్ పూర్తిగా పనిచేస్తున్నదని ఛటర్జీ హామీ ఇచ్చారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతున్నాయని, భారతీయ విద్యార్థులందరూ సిద్ధమవుతున్నారని చెప్పారని తెలిపారు. అక్కడ జరిగిన ఘటనలో భారతీయ విద్యార్థులెవరూ తీవ్రంగా గాయపడలేదని, దవాఖానలో చేరలేదని ఛటర్జీ స్పష్టం చేశారని వెల్లడించారు. మరోవైపు, కిర్గిస్థాన్‌లోని తెలంగాణ విద్యార్థుల భద్రతపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశా రు. బిష్కెక్లోని భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న హింసాత్మక ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కిర్గిస్థాన్‌లోని తెలంగాణ విద్యార్థుల భద్రత కోసం వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం కార్యాలయాన్ని, భారత ప్రభుత్వ అధికారులను, విదేశాంగ మంత్రి జైశంకర్‌ను, బిషెక్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కోరారు.