నెల్లికుదురు, జూలై 26 : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడుకు చెందిన నల్లాని నవీన్‌కుమార్(29) లండన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో మృతదేహం శనివారం స్వగ్రామమైన మునిగలవీడుకు చేరింది. స్థానికుల కథనం ప్రకారం… మునిగలవీడు గ్రామానికి చెందిన నల్లాని భీంరావు-రమాదేవి కుమారుడు నల్లాని నవీన్.
తండ్రి భీంరావు గతంతో మృతి చెందాడు. నవీన్ నాలుగు సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 3న కొన్ని అనివార్య కారణాలతో మనస్తాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 9న కుటుంబసభ్యులకు సమాచారం అందింది. నవీన్ కుంటుబం ఆర్థికంగా వెనకబడి ఉన్న నేపథ్యంలో మాజీ సర్పంచ్ నల్లాని నవీన్‌రావు.. పుసిరికపల్లి వాసుదేవరావు ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సమాచారం అందించారు.
వెంటనే కేటీఆర్ స్పందించి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్‌తోపాటు అక్కడి ఇండియన్ ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయ, సహకారాలు అందించి నవీన్‌కుమార్ మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. నవీన్‌కుమార్ మృతదేహం మునిగలవీడుకు చేరుకోగా కుటుంబసభ్యులు, గ్రామస్థులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహం లండన్ నుంచి స్వగ్రామానికి చేరుకోవడానికి సహకరించిన కేటీఆర్‌కు మృతుడి కుటుంబసభ్యులు, గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.