75% నదుల్లో పరిమితికి మించిన భార లోహాలు
ప్రమాదకర స్థాయిలో ఆర్సెనిక్, కాడ్మియం, పాదరసం
గంగానది పరిస్థితి మరింత భయానకం
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): దేశంలోని 75 శాతం నదుల్లో విషం ప్రవహిస్తున్నది! ఆయా నదీ జలాలు తదితర విషపూరిత, భార లోహాలతో నిండిపోతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు వెంటనే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మానవాళికి భారీ ముప్పు తప్పదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తాజా నివేదికలో హెచ్చరించింది. ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్-2022’ పేరిట సీఎస్ఈ విడుదల చేసిన నివేదిక దేశంలోని నదీ జలాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో, అవి ఎలా విషతుల్యం అవుతున్నాయో కండ్లకు కట్టింది.
సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో 2018 ఆగస్టు నుంచి 2020 డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా 28 రాష్ర్టాల్లో వివిధ నదుల్లోని 688 స్టేషన్ల వద్ద నీటి నమూనాలను పరిశీలించి, ఈ నివేదికను రూపొందించారు. దేశంలోని ప్రతి నాలుగు రివర్ మానిటరింగ్ స్టేషన్లలో మూడింటిలో సీసం, ఇనుము, నికెల్, కాడ్మియం, ఆర్సెనిక్, క్రోమియం, కాపర్ వంటి విషపూరిత లోహాలు భయంకరమైన స్థాయిలో నమోదైనట్టు నివేదిక పేర్కొన్నది. 117 నదులు, ఉపనదుల్లో విస్తరించి ఉన్న మానిటరింగ్ స్టేషన్లలో నాల్గవ వంతులో రెండు లేదా అంతకంటే ఎకువ విషపూరిత లోహాలు అధికస్థాయిలో ఉన్నట్టు విశ్లేషించింది. గంగానది లోని 33 మానిటరింగ్ స్టేషన్లలో పదిచోట్ల కాలుష్య స్థాయి అత్యంత తీవ్రస్థాయిలో ఉన్నదని ఆందోళన వ్యక్తంచేసింది. అధిక స్థాయిలో సీసం, ఇనుము, నికెల్, కాడ్మియం, ఆర్సెనిక్ ఉన్నట్టు వివరించింది.
మానవ తప్పిదాలే కారణం
వ్యవసాయరంగంలో మోతాదుకు మించి రసాయనాల వాడకం, లోహ పరిశ్రమలు, వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నదుల్లో భారలోహాల పరిమాణం ఏటేటా పెరుగుతున్నదని సీఎస్ఈ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 72% మురుగు వ్యర్థాలను శుద్ధి చేయకుండానే నదుల్లోకి డంప్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేసింది.
భార లోహం ఆరోగ్యంపై విషకాటు
ఎకువ పరమాణు సాంద్రత కలిగిన మూలకాలను భార లోహాలు అంటారు. ఇవి భూమి లోపలి క్రస్ట్, రాళ్లలో ఖనిజాల రూపంలో ఉంటాయి. ఆర్సెనిక్, కాడ్మియం, క్రోమియం, రాగి, సీసం, మాంగనీస్, పాదరసం, నికెల్, యురేనియం తదితర లోహాలను భారలోహాలుగా పరిగణిస్తారు. పర్యావరణంలోకి ప్రవేశించే ఈ విషపూరిత భార లోహాలు ప్రకృతిలో తక్షణమే కలిసిపోవు. జంతువులు, మానవ శరీరాల్లో సుదీర్ఘకాలం పేరుకుపోతుంటాయి. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. కొన్ని భార లోహాలు జీవసంబంధ కార్యకలాపాలు, పెరుగుదలపై ప్రభావం చూపితే, మరికొన్ని ఒకటి లేదా అంతకంటే ఎకువ అవయవాల్లో పేరుకుపోయి క్యాన్సర్లు, చర్మ వ్యాధులు, నాడీ వ్యవస్థ లోపాలు, మూత్రపిండ సంబంధిత వ్యాధులను కలిగిస్తాయి. ఈ లోహాల విషతత్వం కారణంగా ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి కావడంతో పాటు డీఎన్ఏ కూడా దెబ్బతింటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.