హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): మన దేశ విద్యుత్తు వ్యవస్థను విదేశీ శక్తులు నియంత్రిస్తున్నాయని భారతీయ కిసా న్ యూనియన్ హర్యానా అధ్యక్షుడు గుర్నాంసింగ్ చడూనీ అన్నారు. దేశంలో పుష్కలమైన జలసంపద ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన పాలకులకు కొరవడిందని విమర్శించారు. హర్యానాకు చెందిన గుర్నాంసింగ్ ఇటీవలి రైతు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఇటీవల జాతీయ రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ విస్తృతంగా జరిపిన చర్చల్లో పాల్గొనేందుకు వచ్చిన గుర్నాంసింగ్ నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు..
కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతాంగం వీరోచితంగా పోరాడి వాటిని రద్దు చేసుకోగలింది. ఇప్పుడు ఇంకా పోరాడాల్సిన అవసరం ఏమిటి?
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు చట్టాలను తాత్కాలికంగానే రద్దుచేసింది. శాశ్వతంగా వాటి ని అమలుచేయాలని పాచికవేస్తున్నది. ఈ తరుణంలో రైతాంగం మరింత అప్రమత్తంగా ఉం డాలి. రైతు సంఘటన్ బాధ్యులుగా దేశ రైతుల పక్షాన మాపై గురుతర బాధ్యత ఉన్నది. యూ పీ ఎన్నికల వేళ వ్యవసాయ చట్టాలను రద్దుచేసింది. ఎన్నికలు పూర్తి కాగానే విద్యుత్తు చట్టానికి సవరణల పేరుతో రైతుల మెడపై కత్తిని వే లాడదీసింది. దీనిపై పోరాటం జరుగుతున్నది.
దేశవ్యాప్తంగా ఒకే ఎంఎస్పీ విధానం ఉండాలని చేస్తున్న పోరాటం ఫలిస్తుందంటారా?
ఎందుకు ఫలించదు? రైతు ఐకమత్యంతోనే కదా మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేసుకోగలిగింది? ఎంఎస్పీని కూడా సాధిస్తామనే విశ్వాసం ఉన్నది. ఎంఎస్పీతోపాటు మరొక ముఖ్యమైన అంశం జలవనరులు. నీటి వనరుల వినియోగంపై దేశానికి ఒక విధానం ఉండాలి. ఎరువులు, విత్తనాలు, మార్కెట్లో దళారీ వ్యవస్థ.. వీటన్నింటిపైనా రైతులు సంఘటితం కావాలి. కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, సాగువ్యతిరేక విధానాలపై ఉమ్మడిపోరాటానికి దేశం సిద్ధమవుతున్నది. నదుల అనుసంధానం అంటూ గొప్ప గొప్ప మాటలు పక్కనబెట్టి చిన్న నీటి వనరులను వృద్ధి చేయాలి. ఉదాహరణకు ఒక రైతుకు 10 ఎకరాలుంటే కచ్చితంగా అర ఎకరంలో చిన్న చెరువునో..కుంటనో ఏర్పాటు చేసుకొనే విధానం రావాలి. తద్వారా తన పంటకు కావలసిన నీటి సమస్య తీరటమే కాకుండా భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదం చేస్తాయి. దేశంలో చిన్న కమతాలు ఎక్కువ కాబట్టి 10-20 మంది రైతులను సమన్వయం చేసి వారికి అందుబాటులో ఉన్న భూమికి అనుగుణంగా చెరువులు తవ్వుకొనే విధంగా ప్రోత్సహించాలి. ఎవరెన్ని చెప్పినా ఈ దేశం వ్యవసాయిక దేశం. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లోనే అత్యధిక ఉపాధి అవకాశాలున్నాయి.
రెండు రోజులు రాష్ట్రంలో వివిధ ప్రాంతా ల్లో పర్యటించారు. మీకు తెలంగాణ ఎలా కనిపించింది?
హైదరాబాద్ రాకముందు మొన్ననే కదా తెలంగాణ ఏర్పడింది? ఇంత చిన్న వయస్సు న్న తెలంగాణ అనేక అంశాల్లో విజయం ఎలా సాధిస్తున్నది? రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నదని విన్నాం. అందరిలాగే గొప్పలు చెప్పుకొంటున్నారనుకొన్నాం. కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులతో మాట్లాడినప్పు డు, పొలాలు చూసినప్పుడు, ఇరిగేషన్ ప్రాజె క్టు (మల్లన్నసాగర్)ను ప్రత్యక్షంగా చూసినప్పు డు.. మనసులో ఉన్నది చెప్పమంటారా (దిల్ కీ బాత్ బోలూ క్యా).. చాలా జలస్ అనిపిచ్చింది. తెలంగాణ వయస్సుకు చిన్నదే కావ చ్చు. కానీ, నేర్చుకోవడానికి దేశంలో అద్భుత ఫలితమిచ్చిన ప్రయోగశాల. కేసీఆర్ మస్తు ముచ్చట చెప్తరని అంటరు కానీ మనసుతో పనిచేస్తరు. మనసుతో పనిచేస్తే ఎంత అద్భుతాలు చేయవచ్చో తెలంగాణ నిరూపించింది. అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల కార్యక్రమా లు చేపట్టారు. దశలవారీగా ఒక్కో వర్గాన్ని అడ్రస్ చేస్తూ పోతున్నారు. తెలంగాణ ఇప్పు డు దేశం తెలుసుకొని తీరవలసిన విజయగాథ.
ఈ చట్టంతో రైతులకు జరిగే నష్టమేమిటి?
కేవలం రైతులకే కాదు సమస్త విద్యుత్తు వినియోగదారులకు ఈ సవరణ చట్టం తీవ్రమైన నష్టం తెస్తుంది. ఇప్పటికే చాలా రాష్ర్టాల్లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టారు. కొత్త చట్టంతో ఇప్పటికే ఉన్న మీటర్లను మార్చి కొత్త మీటర్లు పెడతారు. ఈ కొత్త మీటర్లు ఇంట్లో ఫ్యాన్ కన్నా ఎక్కువగా తిరిగి రైతు కష్టమంతా కరెంట్‌కు ధారపోయాల్సి వస్తుంది. ఇప్పటికే రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ఇక మోటర్లకు మీటర్లు పెడితే.. వ్యవసాయం నుంచి శాశ్వతంగా దూరమవుతారు. విద్యుత్తు చట్టాల వెనుక అసలు రహస్యం ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. దేశంలో లభించే బొగ్గును కాదని.. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే విధానం వల్ల వినియోగించే ప్రతి యూనిట్ ధరను నిర్ణయించే అధికారం మెల్ల మెల్లగా విదేశీ శక్తుల చేతుల్లోకి పోనున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే స్వదేశంలో విదేశీ విధానం అమలుకు మనమే ఒప్పుకొని కరెంట్ కాటుకు బలి కావాల్సిన దుస్థితి రాబోతున్నది. దీనిపై పోరుకు దేశమంతా సంఘటితం కావాలి.