న్యూఢిల్లీ, జూలై 3: మోదీ-షా పాలన నుంచి ఎన్నికల ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పు పొంచి ఉందని విపక్ష ఇండియా కూటమి శుక్రవారం పేర్కొంది. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ను నిలిపివేయాలని, మళ్లీ బ్యాలట్ పేపర్లకు తిరిగి వచ్చే విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో డిమాండ్ చేసింది. ఈ లేఖపై 24 ప్రతిపక్ష పార్టీలు, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ సంతకాలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్‌కు మంగళవారం పంపిన ఈ లేఖలో ప్రజాస్వామ్య సంస్థలే అణచివేత సాధనాలుగా మారి ప్రభుత్వ అజెండాను ముందుకు తీసుకువెళ్లే పరిస్థితి తలెత్తితే ప్రజాస్వామ్య భవిష్యత్తు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఈ లేఖను విడుదల చేస్తూ పారదర్శకత దృష్ట్యా, ఎన్నికల ప్రక్రియ పట్ల విశ్వసనీయత, జవాబుదారీతనం, ప్రజల నమ్మకాలను పునరుద్ధరించడానికి అత్యవసరమైన కఠిన చర్యలను సుప్రీంకోర్టు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రదర్శించిన పూర్తి పక్షపాత ధోరణి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) వంటి అంశాలపై ఈ లేఖలో ప్రశ్నలు లేవనెత్తారు.
ఎన్నికల కమ్యూనికేషన్లో మీడియా పాత్ర కీలకం:సీఈసీ
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణలో మీడియా, ప్రజా సంబంధాల అధికారుల పాత్ర కీలకమని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన మీడియా, కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సులో తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ అధికారులతోపాటు దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 240 మంది డీపీఆర్వోలు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఎన్నికల నిర్వహణలో మీడియా పాత్ర, సోషల్ మీడియా సవాళ్లు, తప్పుడు ప్రచారాల నియంత్రణ, డిజిటల్ సాంకేతికత వినియోగం తదితర అంశాలపై ఈసీ అధికారులు అవగాహన కల్పించారు. సదస్సులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, ఎన్నికల చట్టాలు, ఫారం-17సీ, ఆర్టికల్-324 కింద ఎన్నికల సంఘం అధికారాలు, పెయిడ్ న్యూస్ నియంత్రణ, ఏఐ సవాళ్లు, ఈసీఐ నెట్ డిజిటల్ వేదిక ద్వారా అందుబాటులో ఉన్న ఎన్నికల సేవలపై అధికారులు ప్రజెంటేషన్లు ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎన్ శంకర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రసన్నరాజ్, రాష్ట్ర మీడియా అకాడమీ సంయుక్త సంచాలకుడు వెంకటేశ్వరరావు, ఐ అండ్ పీఆర్ అధికారులు ఎం కిరణ్మయి, ఏ వనజ తదితరులు పాల్గొన్నారు.